కాన్వెంట్ టీచర్ కహానీ!
ఢీ అంటే ఢీ అని రెడీ అయిపోయారు శ్రీకాంత్. ఆయన చేసిన తాజా చిత్రం పేరిది. స్వీయదర్శకత్వంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు రూపొందించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో జొన్నలగడ్డ రూపొందించిన ఈ సినిమా బాగా వచ్చింది. ప్రేక్షకుల స్పందన బాగుంటుందనే నమ్మకం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా బ్రహ్మానందం చేసిన రెండు పాత్రలూ బ్రహ్మాండంగా ఉంటాయి. కొడుకు పాత్ర వయసు తొమ్మిది. దీన్నిబట్టి వినోదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు’’ అన్నారు. రచయిత రాజేంద్రకుమార్ మాట్లాడుతూ -‘‘ఇందులో శ్రీకాంత్‌గారు కాన్వెంట్ టీచర్ పాత్ర చేశారు.
ఛోటా భీమ్ పాత్ర చేయాలని చెప్పగానే బ్రహ్మానందంగారు చాలా ఎగ్జయిట్ అయ్యారు’’ అని చెప్పారు. జొన్నలగడ్డ మాట్లాడుతూ -‘‘భూపతిరాజాగారు చెప్పిన కథ నచ్చి, దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించాలనుకున్నాను. అప్పుడు సీయస్ రెడ్డి, జి. జ్యోతిక సహనిర్మాతలు చేస్తామని ముందుకొచ్చారు. కొంతమంది సాంకేతిక నిపుణులు పారితోషిం తీసుకోకుండా చేశారు. వినోదం, వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న చిత్రం ఇది’’ అన్నారు. పంజాబీలో చాలా చిత్రాలు చేశాననీ, తెలుగులో ఇది తొలి చిత్రమనీ కథానాయిక సోనియా మాన్ తెలిపారు.