‘ప్రేమెంత ప‌నిచేసె నారాయ‌ణ‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ | Prementha Panichese Narayana Pre Release Event Held At Hyderabad | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘ప్రేమెంత ప‌నిచేసె నారాయ‌ణ‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

Published Sun, Feb 17 2019 4:33 PM | Last Updated on Sun, Feb 17 2019 4:42 PM

Prementha Panichese Narayana Pre Release Event Held At Hyderabad - Sakshi

తన కుమారుడు హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రేమెంత ప‌నిచేసె నారాయ‌ణ‌’. జొన్నలగడ్డ శ్రీనివాసరావు.. నాగార్జున హీరోగా ఎదురులేని మనిషి సినిమాతో డైరెక్టర్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. హరికృష్ణ, అక్షిత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని భాగ్యల‌క్ష్మి స‌మ‌ర్పణ‌లో జె.ఎస్. ఆర్ మూవీస్ ప‌తాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు.

అన్ని ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 22న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్‌. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఆదివారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ సంగీత దర్శకుడు యాజమాన్యకు తొలి జ్ఞాపికను అందజేశారు. అనంతరం శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసరావు చాలా సంవత్సరాలుగా నాకు తెలుసు. ఆయనకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. వాళ్ల అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ.. అన్ని బాధ్యతలను తీసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా ప్యాషన్‌తో శ్రమించాడు. హరిలో మంచి జిల్‌ ఉంది. సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. భవిష్యత్తులో మంచి స్టార్‌ అవుతాడ’ని అన్నారు.

కాశీ విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. ‘శ్రీనివాసరావు గత చిత్రాల్లో నేను నటించాను. నచ్చావులే తర్వాత అలాంటి మంచి పాత్ర ఈ సినిమాలో దొరికింది. ఆ సినిమా కన్నా ఈ చిత్రం పెద్ద సక్సెస్‌ కావాల’ని కోరారు. మరుదూరి రాజా మాట్లాడుతూ.. హరిలో మంచి ఫైర్‌ ఉందన్నారు. మంచి కథతో హరి హీరోగా పరిచయం అవుతున్నాడని తెలిపారు. హీరో, ఝాన్సీ పాత్రల మధ్య సవాల్‌తో ఈ కథ నడుస్తుందని పేర్కొన్నారు. సినిమా కోసం తండ్రీ కొడుకులిద్దరూ ఎంతగానో కష్టపడ్డారని చెప్పారు. 

హరికృష్ణ మాట్లాడుతూ.. రెగ్యూలర్‌ లవ్‌ స్టోరీలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ప్రేమ అంటే అమ్మాయి, అబ్బాయి ఉంటే సరిపోతుందని అనుకుంటారు.. కానీ స్నేహితుడు లేకపోతే ప్రేమ లేదని చెప్పే సినిమా ఇది అని తెలిపారు. దర్శకనిర్మాతలు తల్లిదండ్రులైనా చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరించారని పేర్కొన్నారు. హీరోయిన్‌ అక్షిత మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అన్నారు. చాలా సన్నివేశాలు ఎమోషన్‌తో నడుస్తాయని తెలిపారు. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘సీనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన మేజర్‌ చంద్రకాంత్‌తో పాటు చాలా సినిమాలకు నేను పనిచేసాను. తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాను. సినిమా బాగా వచ్చిందని నమ్ముతున్నాను. అల్లు అరవింద్‌ మా సినిమాకు ఎంతగానో సపోర్ట్‌ చేస్తున్నారు. ఈ నెల 22న చిత్రం ప్రేక్షకుల మందుకు రానుంద’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement