సతీశ్ వేగేశ్న, ‘దిల్’ రాజు, మిక్కీ జె. మేయర్, రాశీఖన్నా, జయసుధ, నితిన్, రాజేంద్రప్రసాద్, నందితా శ్వేత, శిరీష్
‘‘శ్రీనివాస కళ్యాణం’ సినిమా అనుకున్న టైమ్‌కి పూర్తవడానికి నటీనటులు, టెక్నీషియన్స్ కృషి ఎంతో ఉంది. నితిన్ అన్నట్లు.. నేను ఈ సినిమా కోసం ఆల్‌మోస్ట్ అసిస్టెంట్‌లాగానే పనిచేశా’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్ హీరోగా, రాశీఖన్నా, నందితా శ్వేత హీరోయిన్లుగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకానుంది.
మిక్కీ జె.మేయర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘శతమానం భవతి’ తర్వాత పెళ్లి కాన్సెప్ట్‌తో సినిమా చేద్దామనుకుంటున్నా అని సతీష్ చెప్పాడు. ‘నేను లోకల్’ సినిమా రిలీజ్ తర్వాత తిరుపతికి వెళ్లా. ‘శ్రీనివాస కళ్యాణం’ టైటిల్ పెట్టినప్పుటి నుంచే ఏదో వైబ్రేషన్. నాకే ఐడియాలు వచ్చాయి. ఏడుకొండల స్వామి దర్శనం వద్ద ఈ కథ తయారయింది. నా కూతురి పెళ్లి చేశా.. మనవడు పుట్టినప్పుడు ఆనంద పడ్డా.
నా భార్య చనిపోయినప్పుడు బాధపడ్డా. ఈ మూడు ఇన్సిడెంట్‌లు నా లైఫ్‌లో జరిగాయి. దీన్ని సతీష్‌తో షేర్ చేసుకుంటే ఈ చిత్రం కథకి రౌండప్ అయింది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండే ఎమోషనల్ మూమెంట్సే ఈ సినిమా. ఇందులో పెళ్లి గురించి అద్భుతంగా చెప్పినా, సినిమా చూసిన తర్వాత ఆయా పాత్రల్లో నటించిన వారిని హృదయంలో పెట్టుకుని వెళతారు. ఈ సినిమా చూస్తే మీ ఇంట్లో ఓ పెళ్లి జరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
‘శ్రీనివాస కళ్యాణం’ ఎంత గొప్ప సినిమా అవుతుందనేది ఆగస్టు 9న తెలుస్తుంది. కానీ, ఓ మంచి సినిమా చేశామని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ‘దిల్’ తర్వాత నితిన్‌తో సినిమా అనుకున్నా కుదరలేదు. నితిన్ ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు ఒక్కసారి ఇంటికొచ్చి.. అంకుల్.. నాకు ఓ సినిమా కావాలన్నప్పుడూ కుదరలేదు. అవన్నీ ఎందుకు కుదరలేదు అంటే ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ చేయాలని ఉంది కాబట్టే. అది మనకెవ్వరికీ తెలీదు. భగవంతుడు ఇవన్నీ డిజైన్ చేసి పెడతాడు’’ అన్నారు.
నితిన్ మాట్లాడుతూ–‘‘నా లైఫ్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ బ్యూటిఫుల్ మెమొరీ. ‘అ ఆ’ తర్వాత మిక్కీ ఈ చిత్రానికి మంచి పాటలిచ్చాడు. ఇందులో ‘కల్యాణం వైభోగం’ పాట నా సినిమాల్లో టాప్ 3లో ఉంటుంది. ప్రతి పెళ్లిలోనూ ఈ పాట మార్మోగుతుంది. రాజుగారి గురించి నటుల్లో నాకంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. ఆయన ఫస్ట్ సినిమా ‘దిల్’ హీరో నేనే కాబట్టి. ‘దిల్’ షూటింగ్ లేకున్నా రాజుగారు పొద్దునే ఆఫీసుకి వెళ్లిపోయి రేపటి సీన్స్ గురించి ఆలోచించేవారు. ‘ఫస్ట్ సినిమాకి వీడికి ఎందుకంత బిల్డప్’ అనుకునేవారు.
‘దిల్’ చిత్రంలో ‘మై నేమ్ ఈజ్ రాజు అంటే.. ఎందుకంత ఫోజు’ అంటాను. ఈ డైలాగ్ కావాలనే సరదాగా పెట్టాం. ఆ సినిమా హిట్ అయింది. మళ్లీ మేం చేయాలనుకున్నా సెట్‌కాలేదు. ‘శ్రీనివాస కళ్యాణం’తో కుదిరింది. ఇన్నేళ్ల తర్వాత కూడా రాజుగారి క్రమశిక్షణ చూసి నేను షాక్ అయ్యా. ‘దిల్’ టైమ్‌లో ఆయనది ఓవరాక్షన్ అనుకునే వారు. కానీ, అది ఆయన ప్యాషన్. అందుకే ఎవరి సపోర్ట్ లేకుండా ఇంత సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయన అసిస్టెంట్‌లాగా పనిచేశారు. నా సినీ కెరీర్ అయిపోయాక చూస్కుంటే టాప్ 1,2 స్థానాల్లో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు.
‘‘యుగాలు మారినా, దేవుడు ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి గొప్పదనం గురించి చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలని చేసిన ప్రయత్నమే ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ రోజుల్లో పెళ్లి ఈవెంట్‌గా మారిపోయింది. కానీ, అది బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు స్ఫూర్తి పొందుతారని నమ్ముతున్నా’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘సమాజానికి విలువలున్న సినిమాలను ఇస్తూ గుర్తింపు పొందుతున్న మంచి సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అందుకే రాజు అంటే నాకు ఇష్టం’’ అన్నారు నటుడు ప్రకాశ్ రాజ్.
‘‘నా 41ఏళ్ల సినీ జీవితంలో ఎన్నోరకాల ఫంక్షన్స్ చూశా. నా జీవితంలో ఎప్పుడూ ఫ్యామిలీతో సినీ ఫంక్షన్‌కి వెళ్లలేదంటే మీరందరూ నమ్మి తీరాలి. కానీ, ఈ రోజు కుటుంబంతో సహా వచ్చానంటే ముఖ్య కారణం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘లేడీస్ టైలర్’, ‘అహనా పెళ్లంట’ సినిమాలు హిట్ అయ్యాక నాకు భయం వేసింది. ఇక ఎలాంటి సినిమాలు తీయాలని. ‘శతమానం భవతి’ వంటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న సతీష్ రెండో సినిమా ఏం తీస్తాడులే అనుకున్నవారికి ‘శ్రీనివాస కళ్యాణం’ చూస్తే తెలుస్తుంది. మా డాడీ రామానాయుడిగారి తర్వాత హ్యాట్సాఫ్ టు ‘దిల్’ రాజు. సినిమా అతని శ్వాస.
ఇండస్ట్రీ, నాలాంటి నటీనటులు నాలుగు కాలాలపాటు బాగుండాలంటే రాజులాంటి వ్యక్తి ఉండాలి’’ అన్నారు నటుడు రాజేంద్రప్రసాద్. ‘‘నరేశ్, నేను తొలిసారి ‘పండంటి కాపురం’ లో నటించాం. అది విడుదలై శనివారంతో 46 ఏళ్లు అయింది. ఈ జర్నీలో ఎన్నో పాత్రలు చేశా. బహుశా రామానాయుడుగారి తర్వాత ‘ఆల్ ఇట్స్ ది వే ‘దిల్’ రాజుగారే అనుకుంటున్నా’’ అని జయసుధ అన్నారు. నిర్మాతలు సుధాకర్ రెడ్డి, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి, రాశీఖన్నా, నందిత శ్వేత, మిక్కీ జె. మేయర్, కెమెరామేన్ సమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment