
అతడికి సిగ్గుంటే నా అనుమతి తీసుకోవాలి: ప్రకాష్ రాజ్
‘‘నన్ను రాళ్ళతో కొట్టకు... పట్టుకొని ఇళ్ళు కట్టేస్తా!
నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు... ఇంటికి దీపం చేసుకుంటా!
నన్ను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలనుకోకు... నేను చేరాల్సిన చోటుకు త్వరగా చేరిపోతా!
దయచేసి చెబుతున్నా... నన్ను చంపాలని విషం పెట్టకు... మింగి, నీలకంఠుణ్ణి అయిపోతా!’’
మహేశ్‌బాబు ‘ఆగడు’ సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి, ఆ చిత్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌ను తొలగించిన విషయం తెలిసిందే. దర్శకుల సంఘానికి చెందిన వారితో అనుచితంగా ప్రవర్తించారంటూ, వ్యవహారం ఫిల్మ్‌చాంబర్ దాకా వెళ్ళడంతో, గడచిన ఏప్రిల్ చివరలో ప్రకాశ్‌రాజ్ విలేకరుల సమావేశం పెట్టి, ఆవేదనతో కవితాత్మకంగా పై మాటలు అన్నారు. అయితే... ‘ఆగడు’ సినిమాలో ప్రకాశ్‌రాజ్ స్థానంలో తీసుకున్న నటుడు సోనూసూద్‌తో ఇదే కవితను చెప్పించారు శ్రీను వైట్ల. ఈ విషయమై శనివారం హైదరాబాద్‌లో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తీవ్రంగా ధ్వజమెత్తారు ప్రకాశ్‌రాజ్. ‘‘అది పద్యం కాదు.
నా ఆవేదన, ఆక్రోశం. ఎవరి వల్ల నేను ఆవేదనకు గురయ్యానో... అతడే, నా స్థానంలో తీసుకున్న వేరొక నటుడితో ఆ మాటలు చెప్పించడం దారుణం. అదేమంటే.. ‘ఆ కవిత నచ్చింది. అందుకే డైలాగ్‌గా వాడుకున్నా’ అంటున్నాడట. శ్రీను వైట్లకు ఏ మాత్రం సిగ్గు, సంస్కారం ఉన్నా... నాకు ఫోన్ చేసి ‘మీ మాటల్ని నేను నా సినిమాలో ఉపయోగించుకుంటాను’ అని అడిగేవాడు. కనీసం వాడుకున్న తరువాతైనా ఆ మాట చెప్పేవాడు’’ అంటూ శ్రీను వైట్లపై ప్రకాశ్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను దర్శకుణ్ణి అనుకోవాలి తప్ప నేనే దర్శకుణ్ణి అనుకోకూడదు. హీరో పవన్‌కల్యాణ్ నుంచి రచయిత కోన వెంకట్ వరకూ అందరిపైనా సెటైర్లు వేశావ్. వాళ్లు నిన్నేం చేశారు! మహేశ్‌లాంటి స్టార్‌ని, డబ్బులు పెట్టే నిర్మాతలను, ప్రేక్షకుల సమయాన్ని వాడుకోవడమే కాక, చివరకు కళామతల్లిని కూడా వాడుకోవాలని చూడటానికి సిగ్గులేదూ’’ అంటూ శ్రీను వైట్లపై ప్రకాశ్‌రాజ్ మండిపడ్డారు.
‘‘మహేశ్‌లాంటి స్టార్ సినిమా అంటే... అభిమానుల్లో అంచనాలు ఉంటాయి. పెద్ద సినిమాల్లో నటిస్తున్నప్పుడు తమ పాత్రకు పేరు రావాలని నటీనటులు తపిస్తుంటారు. తాము పెట్టిన పెట్టుబడికి తగిన లాభాలు రావాలని నిర్మాతలు ఆకాంక్షిస్తుంటారు. వీటన్నింటినీ నెరవేర్చే బాధ్యత దర్శకుడిదే. అందుకే కసితో పనిచేయాలి. అంతేకానీ కక్షతో కాదు. వ్యక్తిగతంగా శ్రీనుపై నాకెలాంటి కోపమూ లేదు. అతని అహంకారం నాకు నచ్చలేదు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి వచ్చాడు. అహంకారాన్ని తగ్గించుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళతాడు. నేను నటుణ్ణి. పిలిచి ‘మంచి పాత్ర ఉంది చేయం’డంటే చేయడానికి నాకభ్యంతరం లేదు’’ అని చెప్పారు ప్రకాశ్‌రాజ్.
చిరు సుగుణాలన్నీ చరణ్‌లో!... ‘గోవిందుడు అందరివాడేలే’ గురించి ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ ‘‘ఇది దర్శకుని సినిమా. బాలరాజు పాత్ర నటునిగా నాకు మరింత గుర్తింపు తెచ్చింది. చాలా కాలం తర్వాత దర్శకుడు కృష్ణవంశీతో పనిచేశాను. ఈ గ్యాప్‌లో నేను కోల్పోయిన ఆనందం మళ్లీ నాకు దక్కింది. చరణ్ నాకు చిన్నప్పట్నుంచీ తెలుసు. నటునిగా నాకు అతను పోటీ కాదు. అయితే, అన్నయ్య చిరంజీవిలోని సుగుణాలన్నీ అతనిలో ఉన్నాయి. ఎనిమిది సినిమాలకే పరిణతిని సంపాదించాడు. హీరో అతనే అయినా బాలరాజు పాత్రకి అతనిచ్చిన గౌరవం చూస్తే ఆశ్చర్యమేసింది’’ అని చెప్పారు. కాగా, ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై శ్రీను వైట్లను ‘సాక్షి’ టి.వి. వివరణ కోరినప్పుడు స్పందించడానికి ఆయన నిరాకరించారు. ఇలాంటి వివాదాలపై గతంలోనూ తాను స్పందించలేదని గుర్తు చేశారు.