టైటిల్: బఘీర
నటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులు
దర్శకుడు: డాక్టర్ సూరి
నిర్మాతలు: హోంబలే ఫిలింస్
సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టి
విడుదల: 31 అక్టోబర్, 2024
ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..
కథ
వేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి.
తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ
ప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.
ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది.
సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.
ఎవరెలా చేశారంటే?
వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.
టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.
(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రేటింగ్: 2.75 /5
Comments
Please login to add a commentAdd a comment