లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్’.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. డిసెంబర్ 21న పలు భాషల్లో భారీగా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వారాహి చలనచిత్ర’ బ్యానర్‌పై నిర్మాత సాయికొర్రపాటి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కైకాల సత్యనారాయణతో పాటు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ..
‘కేజీఎఫ్ కన్నడ సినిమాలాగా కాకుండా పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. అంత మంచి విజువల్స్ రావాలంటే డబ్బులు పెడితేనో, హీరో డేట్స్ ఇస్తేనో రావు. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఉండాలి. అలాంటి టీమ్ వీళ్లకు దొరికింది కాబట్టే ఇలాంటి సినిమా తీయగలిగారు. ఇండియాలో ఏ భాషలోనూ లేని గొప్పతనం మన తెలుగువాళ్లకు ఉంది. ఒక సినిమా నచ్చితే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. కేజీఎఫ్ చాలా పెద్ద విజయం సాధించాల’ని రాజమౌళి కోరుకున్నారు.
‘రాజమౌళి ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి మా అందరికీ బాట వేశారు. విజన్ ముందు బడ్జెట్ అనేది చాలా చిన్న విషయం అని నిరూపించారు. మీ అడుగుల్లోనే మేము ధైర్యంగా ఈ చిత్రన్ని పాన్ ఇండియాన్ సినిమాగా తీసుకొస్తున్నాం. హ్యాట్సాఫ్ సర్. నా టీమ్‌లోని ప్రతి టెక్నీషియన్ ఎంతో కష్టపడి పని చేయడం వల్లే ఇలాంటి సినిమా సాధ్యమైంది. చాలా ఎఫర్ట్ పెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం. తెలుగు ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తార’ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment