టమోటా పులిహోర
ఎప్పుడూ స్టార్ట్... యాక్షన్... కట్ అంటూ సినిమాయే ప్రపంచం అని బతికేస్తే ఇక మజా ఏముంటుంది? ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడిపితే, అది కూడా వంటింట్లో భార్యకు సహాయం చేస్తే లభించే ఆనందమే వేరు. ఇటీవల రాజమౌళి ఆ ఆనందాన్ని ఆస్వాదించారు.
రాజమౌళి మంచి దర్శకుడు మాత్రమే కాదు.. మంచి కొడుకు, భర్త, తండ్రి కూడా. వీలు కుదిరినప్పుడు కాకుండా వీలు చేసుకుని మరీ కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. ఇటీవల కొంత సమయాన్ని వంట గదిలో గడిపారు. ‘టమోటా పులిహోర’ కలపడానికి ఓ చెయ్యేశారాయన. చింతపండు, దబ్బకాయ.. ఇలా రకరకాల పులిహోరలు విన్నాం కానీ, టమోటా పులిహోర అంటే అరుదనే చెప్పాలి.
ఈ పులిహోర చేయడంలో నా భార్య రమ ప్రతిభే వేరంటున్నారు రాజమౌళి. ఎంచక్కా పోపు, అన్నాన్ని రమ కలిపితే, చివరగా ఈ మిక్సింగ్‌లో ఓ చెయ్యేశారు రాజమౌళి. ఈ తతంగాన్ని ఫొటో తీసి, ట్విట్టర్‌లో పెట్టారాయన. షూటింగ్ స్పాట్స్‌లో మెగాఫోనో, కెమెరానో పట్టుకుని కనిపించే రాజమౌళి ఇలా... కనిపించడం తమాషాగా ఉంది కదూ!