బాహుబలి :'ది కంక్లూజన్' సీక్వెల్ కాదు
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే తొలి భాగం ఘనవిజయం సాధించటంతో ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఈ దర్శకధీరుడికి ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన రాజమౌళి, బాహుబలి 2 పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. అయితే తనకు బాలీవుడ్లో స్ట్రయిట్ సినిమా చేసే ఆలోచన అయితే ఉందని, అది బాహుబలి సినిమాను బాలీవుడ్లో పంపిణీ చేసిన ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ నిర్మాణంలో అయ్యే అవకాశం కూడా ఉందని తెలిపాడు.
బాహుబలి సినిమాకు సంబంధించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు రాజమౌళి. బాహుబలి 2 సీక్వెల్ కాదని, ఒకే కథని రెండు భాగాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామన్నాడు. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అనుకున్న సమయానికే సినిమాను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు. అంతేకాదు బాహుబలి 3 కూడా ఉంటుందని అయితే ఆ సినిమాకు తొలి రెండు భాగాలకు సంబంధం ఉండకపోవచ్చన్నాడు. ఇప్పటివరకు బాహుబలి 3 పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న జక్కన్న బాహుబలి హవా సినిమా తరువాత కార్టూన్, గేమ్స్ ఇలా ఏదో ఒక రూపంలో కొనసాగుతుందన్నాడు.