
దర్శకధీరుడు రాజమౌళి సరదాగా కన్ను కొట్టారు... ఓ పక్క ఎన్టీఆర్, మరోపక్క రామ్‌చరణ్‌ను పెట్టుకుని మధ్యలో ఆయన కూర్చున్న ఫొటోను ట్వీట్ చేస్తూ! కన్ను కొట్టడానికి ముందు కొంత ఖాళీ స్పేస్ (డాష్)ను వదిలారు... ‘ఫిల్ ఇన్ ద బ్లాంక్స్’ (మీ ఊహకు వదిలేస్తున్నా) అన్నట్టు! ఇంతకీ, ఈ ముగ్గురూ ఎప్పుడు కలిశారు? అంటే... శనివారం రాత్రి! బహుశా... వీకెండ్ పార్టీ ఏమో! ఎన్టీఆర్, రామ్‌చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. మొన్న ‘జై లవకుశ’ హిటై్టనప్పుడు ఎన్టీఆర్‌ని ఇంటికి పిలిచిన చరణ్ స్పెషల్ పార్టీ ఇచ్చారు.
ఈ ఇద్దరితోనూ రాజమౌళి సినిమాలు తీశారు. ఎన్టీఆర్–రాజమౌళి కలయికలో ‘స్టూడెంట్ నెం1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వంటి హిట్స్ వస్తే... చరణ్–రాజమౌళి కలయికలో ‘మగధీర’ వచ్చింది. ఇప్పుడీ ముగ్గురూ కలిసిన ఈ ఫొటోను రాజమౌళి ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? అని ఆరా తీయగా... ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారట! రాజమౌళి కన్ను కొట్టడానికి కారణమదేనని ఫిల్మ్‌నగర్ టాక్! మొన్నామధ్య రాజమౌళి ‘రంగస్థలం’ సెట్స్‌కి వెళ్లడానికి కారణం కూడా కొత్త సినిమా కథా చర్చలేనట! ‘బాహుబలి–2’ తర్వాత ఏ సినిమా చేసేదీ ఇప్పటివరకూ రాజమౌళి వెల్లడించలేదు.
కానీ, కథపై కసరత్తులు చేస్తున్నారట. అదో మల్టీస్టారర్ కథనీ, అందులో ఎన్టీఆర్–చరణ్ హీరోలుగా నటించడానికి అంగీకరించారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్! డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ప్రస్తుతం ‘రంగస్థలం’లో నటిస్తున్న చరణ్, ఆ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమా, చరణ్–బోయపాటి సినిమా ఇంచుమించు ఒకేసారి పూర్తవుతాయి. అప్పుడు ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా రాజమౌళి తీయబోయే మల్టీస్టారర్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్!!