‘‘కర్ణాటక చిత్రసీమలో పునీత్ రాజ్‌కుమార్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన లేకపోవడం శూన్యంగా అనిపిస్తోంది’’ అన్నారు ఎన్టీఆర్. శుక్రవారం బెంగళూరులో జరిగిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కన్నడ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, హీరోయిన్ ఆలియా భట్ పాల్గొన్నారు.
ఈ వేడుకలో ఎన్టీఆర్ కన్నడంలో మాట్లాడుతూ– ‘‘ఇల్లి జనగలను నోడదరె తుంబ ఖుషీ ఆక్తాయిదె.. ఎల్లారు జత కన్నడ మాత్తాడన్ అవకాశ బందిదె. థ్యాంక్స్ టూ కర్ణాటక, నమ్మ తాయి కర్ణాటక మూలద. ఈగ నాను నటిసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర.. ఇల్లి కన్నడదల్లి డబ్ ఆగిదె. బహుళ సంతోష. కన్నడదల్లి నన్న వాయిస్ ఇరుత్తె (కన్నడ ప్రజలను చూస్తే ఆనందం వేస్తోంది. అందరి మధ్యలో కన్నడ భాష మాట్లాడటం ఆనందంగా ఉంది. మా అమ్మ కర్ణాటకకు చెందిన వారే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం కన్నడ డబ్‌లో కావడం చాలా సంతోషంగా ఉంది. నా సొంత వాయిస్ వినిపిస్తాను)’’ అన్నారు.
అంతేకాదు... కర్ణాటకకు వచ్చిన ప్రతిసారీ పునీత్‌ను కలిసి వెళ్లేవాడినని చెప్పారు. ఇదిలా ఉంటే పునీత్ రాజ్‌కుమార్ నటించిన కన్నడ చిత్రం ‘చక్రవ్యూహ’ (2016)లోని ‘గెలయా.. గెలయా’ పాటను ఎన్టీఆర్ పాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వేదికపై ఈ పాట పాడి, భావోద్వేగానికి గురయ్యారు ఎన్టీఆర్. ‘‘ఎల్లరిగూ నమస్కార’ (అందరికీ నమస్కారం). ‘ముఠా మేస్త్రి’ సినిమా నుంచి చిరంజీవి కుటుంబ సభ్యులకు కర్ణాటకలో ఆదరణ లభిస్తోంది. కన్నడ సినిమాలో నటించేందుకు వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు రామ్‌చరణ్. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత కన్నడ నటులతో పూర్తి స్థాయిలో సినిమా చేసే ప్లాన్ ఉంది’’ అన్నారు రాజమౌళి.
Comments
Please login to add a commentAdd a comment