
కాలేజీలో హీరోయిన్ ఫొటోల హల్ చల్!
యూనివర్సిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ వర్గానికి చెందిన స్టూడెంట్ యూనియన్ తమ ఎన్నికల ప్రచార పోస్టర్లపై ప్రియాంక చోప్రా ఫొటోలను వినియోగించారు. అసలు విషయం ఏంటంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కు చెందిన విద్యార్థి సంఘం నాయకుడు ప్రియాంక చౌరీ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) యూనియన్ తరఫున ఉపాధ్యక్ష రేసులో ఉన్నాడు.
ప్రియాంక పేరు కలిసొస్తుందని ప్రియాంక చౌరీ తమ ప్రచారం పోస్టర్లపై హీరోయిన్ ఫొటో వాడుతున్నారు. గతంలోనూ వర్సిటీ ఎన్నికల్లో భాగంగా సెలబ్రిటీల ఫొటోలతో వాల్ పోస్టర్లు అంటించారు. 'ఆల్ ద బెస్ట్ ప్రియాంక 4 ఇమ్మీస్' అని ప్రియాంక చౌరీ బ్యాలెట్ నెంబర్ 4ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏబీవీపీ జాతీయ మీడియా కన్వినర్ సాకేత్ బహుగుణను ప్రశ్నించగా.. తాము హీరోయిన్ పోస్టర్లతో ప్రచారం చేయలేదన్నారు.
68వ ఇమ్మీ అవార్డుల్లో ప్రియాంక చోప్రా పాల్గొననున్న సందర్భంగా హీరోయిన్ ఫ్యాన్స్ వాల్ పోస్టర్స్ అంటించారని, ప్రియాంక 4 ఇమ్మీస్ అంటే ప్రియాంక ఫర్ ఇమ్మీస్ అనే అర్థమని వివరణ ఇచ్చారు. యాధృచ్ఛికంగా తమ అభ్యర్థి బ్యాలెట్ నెంబర్ 4 కావడంతో తమపై దుష్రచారం జరిగిందని ఆరోపించారు. 2014 వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ సెక్రటరీ అభ్యర్థి నౌహీద్ సైరసీ పోస్టర్లతో ప్రచారం చేసి విజయం సాధించడం గమనార్హం.