సోషల్‌ ‘వార్‌’కు గుర్‌మెహర్‌ స్వస్తి | What Gurmehar teaches us all | Sakshi
Sakshi News home page

సోషల్‌ ‘వార్‌’కు గుర్‌మెహర్‌ స్వస్తి

Published Wed, Mar 1 2017 1:06 AM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

సోషల్‌ ‘వార్‌’కు గుర్‌మెహర్‌ స్వస్తి - Sakshi

సోషల్‌ ‘వార్‌’కు గుర్‌మెహర్‌ స్వస్తి

తనను ఒంటరిగా వదిలేయాలని విజ్ఞప్తి
► ఢిల్లీ వర్సిటీలో ఏబీవీపీ వ్యతిరేక ర్యాలీ..

న్యూఢిల్లీ: ఏబీవీపీకి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో తన ప్రచారాన్ని విరమిస్తున్నట్లు లేడీ శ్రీరాం కాలేజీ విద్యార్థిని, కార్గిల్‌ అమరుడి కుమార్తె గుర్‌మెహర్‌ కౌర్‌ మంగళవారం స్పష్టంచేసింది. ప్రచారంపై తీవ్ర వ్యతిరేకతతోపాటు అత్యాచార, హత్య బెదిరింపులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ప్రచారాన్ని విరమించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. నన్ను ఒంటరిగా వదిలేయండి.  నా ధైర్యసాహసాలను ప్రశ్నించేవారికి అవసరమైనదానికంటే ఎక్కువే సమాధానమిచ్చా’ అని ట్వీట్‌ చేసింది.

తన కుటుంబంతో కలసి ఉండేందుకు ఆమె జలంధర్‌కు వెళ్లింది. ఆమెకు రక్షణ కల్పించాలని అక్కడి పోలీసులను ఢిల్లీ పోలీసులు కోరారు. మరోవైపు.. ఢిల్లీ వర్సిటీ నార్త్‌ క్యాంపస్‌లో ఏబీవీపీకి వ్యతిరేకంగా మంగళవారం జేఎన్ యూ, డీయూ, జామియా వర్సిటీలకు వందలాది విద్యార్థులు, అధ్యాపకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి గుర్‌మెహర్‌ కౌర్‌ గైర్హాజరైంది. కౌర్‌కు వచ్చిన బెదిరింపులకు సంబంధించి ఢిల్లీ పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై.. లైంగిక వేధింపులు, బెదిరింపుల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, ర్యాలీలో ఇద్దరు ఏఐఎస్‌ఏ విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌర్‌ వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్‌ సరదా కోసమేనని, దాన్ని అపార్థం చేసుకున్నారని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చెప్పారు. అయితే కౌర్‌ వ్యాఖ్యలను ఒలింపిక్‌ మెడలిస్ట్‌ యోగేశ్వర్‌ దత్‌ ఖండించారు. కౌర్, హిట్లర్, లాడెన్ ల ఫొటోలను జతచేసి దత్‌ పోస్ట్‌ చేశారు.

‘తండ్రి ఆత్మ క్షోభిస్తోంది’
కౌర్‌పై కేంద్ర మంత్రి కిరెన్  రిజిజు విమర్శలు ఆపడం లేదు. ‘మన జవాన్లు విధుల్లో చనిపోతే వేడుక చేసుకునే వారు కౌర్‌ను తప్పుదారి పట్టిస్తున్నారు.. ఆమె తండ్రి ఆత్మ తప్పకుండా క్షోభిస్తూ ఉంటుంది’ అని అన్నారు. ‘జవాన్లు చనిపోతే లెఫ్టిస్టులు పండగ చేసుకుంటారు. వర్సిటీల్లో్ల యువతను తప్పుదారి పట్టిస్తున్నారు’ అని ఆరోపించారు.

రిజిజు విమర్శలను సీపీఎం నేత సీతారాం ఏచూరి తిప్పికొట్టారు. ‘‘గాంధీని చంపాక ఎవరు పండుగ చేసుకున్నారు? ‘గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్‌ కార్యకర్తలు సంతోషంతో స్వీట్లు పంచారు’ అని పటేల్‌(తొలి హోం మంత్రి)..గోల్వార్కర్‌(ఆరెస్సెస్‌)కు 11–09–1948న చెప్పా రు’’ అని ఏచూరి ట్వీట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement