
ఉయ్యాలవాడలో మరో స్టార్ హీరో..!
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా కసరత్తులు చేస్తున్నాడు. వంద కోట్ల వసూళ్లు సాధించిన తరువాత రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా ఓ చారిత్రక కథతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆంగ్లేయుల మీద తిరగబడ్డ తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.
త్వరలో సెట్స్ మీద కు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చిరుకు జోడిగా బాలీవుడ్ బ్యూటి ఐశ్వర్యారాయ్ నటిస్తోందని, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఈ సినిమాలో కీలక పాత్రకు అంగీకరించారన్న వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఉయ్యాలవాడ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుధీప్ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించాడట. ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సుధీప్ ఇమేజ్ ఈ సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇతర భాషా నటులను తీసుకునేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంది. అన్ని భాషల్లో కలిసొచ్చేలా సినిమాకు మహావీర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.