అమ్మాయిలే ఎక్కువ మెసేజ్‌లు చేస్తున్నారు
సినిమా సినిమాకీ సరికొత్త పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సుధీర్‌బాబు. తెలుగులో హీరోగా చేస్తున్న ఆయన హిందీ ‘బాఘీ’ చిత్రంలో విలన్‌గా నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన ‘బాఘీ’ విశేషాలు, భవిష్యత్ ప్రాజెక్ట్స్ వివరాలు చెప్పారు.
♦ ‘ఏమాయ చేశావే’ చిత్రంలో నెగటివ్ పాత్రలో టాలీవుడ్‌కి పరిచయమయ్యా. తెలుగు హిట్ మూవీ ‘వర్షం’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘బాఘీ’ చిత్రంలో ప్రతినాయ కుడిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టా. నేను హిందీలో విలన్‌గా నటించడంపై మొదట నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత అందరికీ నచ్చింది. యూ ట్యూబ్‌లో పన్నెండు వేల మంది వీక్షించారు.
♦ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫాదర్ అయిన ప్రముఖ నటుడు శక్తీకపూర్ ఫోన్ చేసి బాగా నటించావు, బాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలొస్తాయన్నారు. ఆయన అన్నట్టే ఆఫర్లు వస్తున్నాయి. ఏది పడితే అది ఒప్పుకోకుండా మంచి సినిమాలనే చేయాలనుకుంటున్నా. హిందీలో హీరోగా అయితేనే చేస్తా అనే షరతు విధించకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తా. అవకాశం వస్తే తెలుగులో కూడా విలన్‌గా నటిస్తా. విలన్‌గా చేస్తే మహిళా ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతుందనుకున్నా. కానీ, ‘బాఘీ’ చూసిన తర్వాత ఎక్కువ మంది అమ్మాయిలే నన్ను అభినందిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు.
♦ ‘భలే మంచి రోజు’ చిత్రానికి కో డెరైక్టర్‌గా పనిచేసిన శ్రీరాం రెడ్డి చెప్పిన కథ నచ్చింది. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతాం. దాని తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నా. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆ పాత్రకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం తెరకెక్కనుంది.