ఆయన ఇప్పుడు కనపడితే ర్యాగింగ్ చేస్తా! | Suhasini Maniratnam Exclusive Interview | Sakshi
Sakshi News home page

ఆయన ఇప్పుడు కనపడితే ర్యాగింగ్ చేస్తా!

Published Tue, May 20 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

ఆయన ఇప్పుడు కనపడితే ర్యాగింగ్ చేస్తా!

ఆయన ఇప్పుడు కనపడితే ర్యాగింగ్ చేస్తా!

 ‘‘నా కెరీర్‌లో నేను ఎక్కువగా చేసినవి తెలుగు సినిమాలే. దాదాపు రెండొందల యాభై పైచిలుకు సినిమాల్లో నేను చేసి ఉంటే... అందులో వందకు పైగా తెలుగు సినిమాలే ఉంటాయి. అందుకే... నేను తెలుగు హీరోయిన్‌ని. ఇది మీ ముందే కాదు, మా ఇంట్లో మా ఆయన ముందు, బాబాయ్ ముందు కూడా చెబుతా’ అన్నారు సుహాసిని. దీన్నిబట్టి తెలుగు సినిమాపై ఆమెకున్న మమకారం అర్థం చేసుకోవచ్చు. అటు గ్లామర్ తారగా మెరిపిస్తూ, ఇటు అభినయతారగా మురిపిస్తూ... తెలుగుతెరను ఓ దశాబ్దం పాటు ఏలారామె. తాజాగా ఎన్. మోహన్ దర్శకత్వంలో తానికొండ వెంకటేశ్వర్లు నిర్మించిన ‘సచిన్’ (టెండూల్కర్ కాదు) సినిమాలో ఓ కీలక భూమిక పోషించిన సుహాసిని ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలివి.
 
 మీ తరం కథానాయికలతో పోల్చి చూస్తే... మీరే ఎక్కువ గ్లామరస్‌గా కనిపిస్తున్నారు. ఏమిటి మీ గ్లామర్ రహస్యం?
 శ్రీదేవిని చూసి కూడా మీరు ఈ ప్రశ్న ఎలా వేయగలిగారు? ఆమెతో పోలిస్తే నా అందం ఎంత! అసలు అందానికి వయసుతో పని లేదండీ. నా దృష్టిలో మోస్ట్ గ్లామరస్ లేడీ అంటే ఇందిరాగాంధీ. ఒక్కసారి ఆమెను చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె హెయిర్ స్టయిలంటే నాకు పిచ్చి. ఇక నా విషయానికొస్తే... చిన్నతనం నుంచి నాకు శరీరంపై శ్రద్ధ ఎక్కువ. ప్రతిరోజూ వ్యాయామాలు చేసేదాన్ని. ఓ విధంగా సినిమాల్లోకి వచ్చాకనే నాకు సోమరితనం పెరిగింది. పెళ్లై, బిడ్డ పుట్టాక మళ్లీ శరీరంపై శ్రద్ధ పెట్టడం మొదలుపెట్టాను. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తా. డాన్సింగ్ ఎక్సర్‌సైజులు చేస్తా. ఈ మధ్యే ఓ రష్యన్ బ్యాలే డాన్సర్‌ని కలిశాను. ప్రస్తుతం ఆమె నా పర్సనల్ ట్రైనర్. ఆమె ద్వారా భిన్నమైన వ్యాయామాలు నేర్చుకుంటున్నా.
 
 మంచుపల్లకి, ముక్కుపుడక, స్వాతి, స్రవంతి, అక్కమొగుడు, అమ్మ... ఇలా ఎన్నో భిన్నమైన పాత్రలు చేసిన మీకు... ఇప్పటి హీరోయిన్లను చూస్తే ఏమనిపిస్తుంది?
 అసూయగా ఉంటుంది. ఎందుకంటే... వీళ్లకున్న సౌకర్యాలు అప్పుడు మాకు లేవు. సినిమా సాంకేతికంగా ఎన్నో రెట్లు ఎదిగిపోయింది. మీడియా వల్ల ప్రపంచం చిన్నదైపోయింది. దీంతో ప్రపంచం మొత్తానికి పరిచయమైపోతున్నారు వీళ్లు. అంతేకాదు, ప్రపంచ సినిమాల్లోని అత్యుత్తమ అభినయ విశేషాలన్నీ ఇప్పుడు వీళ్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని ప్రయోగాత్మక చిత్రాలన్నింటినీ వీళ్లు చూసేయొచ్చు. మేం సావిత్రిగారిని, శ్రీదేవిగారిని చూసి ‘ఓహో... ఇలా చేయాలా, ఇలా డ్రస్ చేసుకోవాలా’ అని నేర్చుకున్నవాళ్లం. కానీ వీళ్లు ఏంజెలీనా జోలీ, జెన్నీఫర్ లోపెజ్ లాంటి వాళ్లను కూడా చూసి అనుసరించవచ్చు. స్టయిల్స్ విషయంలో హాలీవుడ్‌కి తగ్గకుండా ముందుకెళ్లొచ్చు. ఇలియానా, కాజల్, తమన్నా... లాంటి వాళ్లను చూస్తుంటే హాలీవుడ్‌కి మనం ఏం తక్కువ అనిపిస్తుంది.
 
 కాస్త ఆలస్యంగా పుట్టి ఉంటే ఈ జనరేషన్ కథానాయిక అయ్యేదాన్నని ఎప్పుడైనా అనిపించిందా?
 వద్దండీ... ఈ సినిమాలే మాకొద్దు. ఈ పాత్రలే మాకొద్దు. వీటిని చూస్తున్నప్పుడు మేం ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంటుంది. ఇప్పుడొస్తున్న దర్శకులు మాత్రం ప్రతిభావంతులు. వాళ్ల టేకింగ్ చాలా బావుంటుంది. వాళ్లతో వర్క్ చేయలేకపోవడం కాస్త బాధగా అనిపిస్తుంది.
 
 సరే... మీతో చేసిన హీరోలు ఇంకా హీరోలుగానే చలామణి అవుతున్నారు కదా. వాళ్లను చూస్తుంటే మీకేం అనిపిస్తుంది. మీ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది?

 నిజంగా వాళ్లు అదృష్టవంతులు. అంబరీష్, చిరంజీవి లాంటివాళ్లు కేంద్రమంత్రులైపోయారు. ఇక రజనీ సార్ ఇప్పటికీ సూపర్‌స్టారే! నిజంగా వీళ్లందర్నీ చూస్తుంటే ఆనందంగా ఉంటుంది. కలిసినప్పుడల్లా చిరంజీవి గారినీ, అంబరీష్ గారినీ ‘ఏం మినిస్టర్!’ అని ఎగతాళి చేస్తుంటాను. ఇప్పుడు బాలయ్య కూడా ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు కనిపిస్తే... ఆయనను కూడా ర్యాగింగ్ చేస్తా. వాళ్లకు కూడా మా తరం వాళ్లతోనే సౌకర్యంగా ఉంటుంది. అభిమానంగానూ ఉంటారు. అయితే, బాధ కలిగించే అంశం ఏంటంటే... శోభన్‌బాబుగారు, విష్ణువర్ధన్‌గారు చనిపోవడం. వాళ్లు పోయారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
 
 మీ బాబాయ్ కమల్‌హాసన్ మీకేమైనా సలహాలిస్తుంటారా? ఆయన నుంచి విమర్శలు కానీ, ప్రశంసలు కానీ అందుతుంటాయా?
 బాబాయ్ లాంటి సిన్సియారిటీ ఉన్న కళాకారుణ్ణి నేను ఇప్పటివరకూ చూడలేదు. పాత్ర కోసం ఎంతటి హింస అనుభవించడానికైనా వెనుకాడరాయన. విమర్శలు, ప్రశంసలూ ఆయన నుంచి అందుతూనే ఉంటాయి. విమర్శలు ఆయన చేస్తే ‘ఓకే’. బయటివాళ్లు చేస్తే మాత్రం ఓ చెవితో విని, మరో చెవితో వదిలేస్తాను. (నవ్వుతూ).
 
 ఇన్నాళ్ల కెరీర్‌లో మీరు కష్టపడి చేసిన పాత్ర?

 ‘ముక్కుపుడక’. ఎందుకంటే అది నా నిజ జీవితానికి పూర్తి భిన్నమైన పాత్ర. అంద వికారంగా ఉండాలి. అమాయకంగా నటించాలి. ఆ పాత్ర చేస్తున్నప్పుడు చాలా కష్టపడ్డాను. తర్వాత కె.రాఘవేంద్రరావుగారి ‘ఆఖరి పోరాటం’లో నటించడానికి బాగా కష్టపడ్డాను. పూర్తి కమర్షియల్ కేరక్టర్ చేయడం నాకు కష్టమే. ఆ డాన్సులు, ఆ ఎక్స్‌ప్రెషన్లు కష్టంగా ఉండేవి.
 
 ఇప్పుడు ‘సచిన్’ సినిమాలో నటించారు కదా. ఇందులో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?
 తమ్ముడి కోసం జీవితాన్ని త్యాగం చేసే అక్క పాత్ర. నా కెరీర్‌లో నేను చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఇందులో చేశానని నమ్మకంగా చెప్పగలను. ఎన్నో ఎమోషన్లు ఆ పాత్రలో ఉంటాయి.
 
 ఇంతకూ మణిరత్నంగారి సినిమా ఎప్పుడు? నాగార్జున, మహేశ్‌లతో సినిమా ఏమైంది?
 అది కొంచెం వాయిదా పడింది. ఆ వివరాలు త్వరలో చెబుతాం. మణి సినిమాల విషయంలో నా ప్రమేయం ఉండదు. త్వరలో ఓ మంచి సినిమా ఆయన నుంచి వస్తుంది.
 
 మీరెప్పుడు మళ్లీ మెగా ఫోన్ పట్టుకుంటారు?
 మా అమ్మానాన్నల అనారోగ్య సమస్యల వల్ల చేయలేకపోతున్నాను. మళ్లీ నా నుంచి సినిమా రావడానికి ఓ అయిదారేళ్లు పడుతుంది.
 - బుర్రా నరసింహ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement