'పీకే' పోస్టర్ పై పిటిషన్
ముంబై: బాలీవుడ్ నటుడు ఆమిర్ఖాన్ పై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు ముంబై కోర్టు శుక్రవారం అంగీకరించింది. ఆమిర్ఖాన్ హీరోగా నటించిన 'పీకే' సినిమాలో అశ్లీల దృశ్యాలు, అభ్యంతకర మాటలున్నాయంటూ హేమంత్ పాటిల్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా నిర్మాత విదూ వినోద్ చోప్రా, దర్శకుడు రాజు హిరాణిలతో పాటు సెన్సార్ బోర్డుపైనా దావా వేశారు. అయితే సెన్సార్ బోర్డుపై పిటిషన్ ను కోర్టు అంగీకరించలేదు.
ఆమిర్ఖాన్ నగ్నంగా రైల్వే ట్రాక్ పై నిలబడి ట్రానిస్టర్ అడ్డుపెట్టుకున్న పోస్టర్ పై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు ఈ సీన్ తొలగించాలని కోర్టును కోరారు. అయితే పీకే సినిమా ఈ రోజు(19-12-2014) విడుదలైంది. ఈ దావాపై తదుపరి విచారణను కోర్టు జనవరి 22కు వాయిదా వేసింది. ఆమిర్ఖాన్ నగ్న పోస్టర్ పై నిషేధం విధించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. 'మీకు నచ్చక పోతే సినిమా చూడడం మానుకోండి' అంటూ అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు చురక అంటించింది.