ఆమిర్ పిచ్చోడు.. ఇడియట్: దర్శకుడి వ్యాఖ్యలు
ఆమిర్ పిచ్చోడు.. ఇడియట్: దర్శకుడి వ్యాఖ్యలు
Published Sat, Oct 22 2016 4:03 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
''ఇలాంటి సినిమాలను పిచ్చోళ్లు మాత్రమే చేస్తారు.. అసలు గట్టిగా మాట్లాడితే ఆమిర్ ఖాన్ ఒక 'ఇడియట్'...'' అని ప్రముఖ దర్శక నిర్మాత విధు వినోద్ చోప్రా వ్యాఖ్యానించారు. ఇదంతా ఎందుకు అన్నారంటే, 'దంగల్' సినిమా చేసినందుకు. ప్రముఖ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన దంగల్ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఆ కోవలోనే విధువినోద్ చోప్రా కూడా స్పందించారు. ఆమిర్ ఖాన్‌కు సినిమాలంటే పిచ్చి అని, అతడు 'త్రీ ఇడియట్స్'లో చేసినప్పటి నుంచి తాము ముద్దుగా ఇడియట్ అని పిలుచుకుంటామని ఆయన అన్నారు. జీవితంలో బాగా డబ్బు సంపాదించి తర్వాత మరణించినా మన గురించి ఎవరూ గుర్తుపెట్టుకోరు గానీ.. ఇలా ఒక ప్యాషన్‌తో పనిచేస్తే మాత్రం ఎన్ని తరాలైనా తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని ఆయన తెలిపారు.
ఇలాంటి సినిమాలు తీయడానికి దమ్ము ఉండాలని, అందులోనూ 51 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ రెజ్లర్ పాత్రలో నటించాలంటే చిన్నవిషయం కాదని ఆయన అన్నారు. మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలు గీతా ఫోగట్, బబితా కుమారిలను కూడా రెజ్లర్లుగా రూపొందించారు. వాళ్లిద్దరూ రియో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆమిర్ ఖాన్ గతంలో నటించిన పీకే, 3 ఇడియట్స్ సినిమాలకు విధు వినోద్ చోప్రా నిర్మాతగా వ్యవహరించారు.
Advertisement
Advertisement