సాక్షి, సినిమా : బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ దంగల్ కలెక్షన్ల సునామీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. భారత్ కంటే చైనాలోనే అత్యధిక వసూళ్లు ( సుమారు 1200 కోట్లు) రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు హాంకాంగ్‌లో తన ప్రభంజనం కొనసాగిస్తోంది.
ఇప్పటిదాకా 23.45 మిలియన్ హాంకాంగ్ డాలర్ల (దాదాపు రూ.19.5 కోట్లు) వసూలుతో రికార్డులు బ్రేక్ చేసింది. గతంలో అమీర్ ఖాన్ చిత్రం త్రీ ఇడియట్స్ (2009) 23.41 మిలియన్ హాంకాంగ్ డాలర్లు వసూలు చేయగా ఇప్పుడు దంగల్ దానిని అధిగమించింది. తద్వారా తన రికార్డును తానే అమీర్ బద్ధలు కొట్టుకున్నాడు. హాంకాంగ్, మకావోలలో మొత్తం 46 స్క్రీన్లలలో దంగల్ సినిమా విడుదలైంది. మాములుగా బాలీవుడ్ సినిమాలు విడుదలయ్యే దానికి నాలుగు రెట్లు అధికమని డిస్నీ ఇండియా ఉపాధ్యక్షుడు అమృతపాండే ప్రకటించారు.
కేవలం విదేశాల్లోనే ఇప్పటిదాకా 217.17 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, భారత్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా 297.68 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. నితేశ్ తివారీ డైరెక్షన్ వహించిన మల్లవీరుడు మహావీర్ ఫోగట్ బయోపిక్ గతేడాది డిసెంబర్‌లో విడుదలై భారత బాక్సాఫీస్ వద్ద 375 కోట్ల వసూళ్లు రాబట్టింది.