
ప్రిన్సిపాల్ కోసం సుకుమార్ క్లాప్
లెక్చరర్‌గా నేనూ, ప్రిన్సిపాల్‌గా ప్రసాద్ ఒకే కాలేజీలో పని చేశాం. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాతో ప్రసాద్ నిర్మాతగా ప్రవేశిస్తున్నారు.
‘‘లెక్చరర్‌గా నేనూ, ప్రిన్సిపాల్‌గా ప్రసాద్ ఒకే కాలేజీలో పని చేశాం. ఇద్దరికీ సినిమాలంటే ఇష్టం. ఈ సినిమాతో ప్రసాద్ నిర్మాతగా ప్రవేశిస్తున్నారు. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్ జంటగా జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకత్వంలో వీఆర్ చలన చిత్రాలు పతాకంపై వీఈవీకేడీఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా శనివారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుకుమార్ క్లాప్ ఇవ్వగా, కె.రామ్మోహన్‌రెడ్డి కెమేరా స్విచ్చాన్ చేశారు.
సీనియర్ నరేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు థామస్‌రెడ్డి, విజయ్‌ప్రసాద్ స్క్రిప్ట్ అందజేశారు. ‘‘సుకుమార్‌తో పాతికేళ్ల అనుబంధం నాది. చక్కటి కథ, కథనాలతో కుటుంబమంతా కలసి చూడదగ్గ అంశాలతో ఈ సినిమా చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత ప్రసాద్. ‘‘గులాబీ’, ‘గీతాంజలి’, ‘సఖి’ తరహా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి’’ అని జొనాథన్ అన్నారు. విజయ్‌రామ్, శివశక్తి సచ్‌దేవ్, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్, సంగీత దర్శకుడు రధన్ పాల్గొన్నారు.