
సుకుమార్ రైటింగ్స్ నుంచి 'డైరెక్టర్'
ఆర్య, 100% లవ్, వన్ నేనొక్కడినే లాంటి సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్.. ఆ తర్వాత నిర్మాతగా మారి తన మార్క్ చూపించాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్, హేబాపటేల్ హీరో హీరోయిన్లుగా తన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కుమారి 21ఎఫ్ సినిమాను తెరకెక్కించాడు. సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా పక్కాగా ఉండటంతో ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఈ విజయంతో నిర్మాతగా కూడా సక్సెస్ సాధించిన సుకుమార్ ఇప్పుడు 'డైరెక్టర్' పేరుతో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథాకథనాలను రెడీ చేసిన సుకుమార్.. డైరెక్టర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాను మరోసారి సూర్యప్రతాప్ చేతిలో పెడతాడా..? లేక మరో దర్శకుణ్ని పరిచయం చేస్తాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమాకు నటీనటులతో పాటు సాంకేతిక నిపుణుల ఎంపిక జరగాల్సి ఉంది.