సన్నీ... ఓ డజను ప్రణయకథలు
ప్రపంచవ్యాప్తంగా శృంగార తారగా పేరొంది, హిందీ సినిమాల్లో పాత్ర పోషణతో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నటి సన్నీ లియోన్ ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. అయితే, ఈసారి నటిగా కాదు... రచయిత్రిగా! ‘స్వీట్ డ్రీమ్స్’ పేరిట 12 కథలతో ఒక పుస్తకం రాశారామె. ‘‘గతంలో ఎప్పుడూ రచయిత్రిని కావాలనే ఆలోచన నాకు లేదు. అయితే, ఇప్పటి వరకు బయటెక్కడా రికార్డు కాని కొన్ని ఆలోచనలు నాకున్నాయి. వాటిని పుస్తక రూపంలో పెట్టాలని ప్రయత్నించా’’ అని సన్నీ చెప్పుకొచ్చారు. ఆమె రచన చేయడం ఇదే తొలిసారి. ‘‘చిన్నప్పుడు నేను డైరీ రాసేదాన్ని.
అప్పట్లో ఒకసారి మా అమ్మ నా డైరీ చదివింది. అంతే! ఇక డైరీ రాయడం మంగళం పాడేశా’’ అని ఆమె చెప్పారు. ఇంతకీ ఈ ‘స్వీట్ డ్రీమ్స్’ కథా సంపుటిలో ఏముంది? భారతీయ నేపథ్యంలో నడిచే ఈ కథల్లో అంతర్లీనంగా రొమాన్స్ కూడా ఉందట! మహిళల్ని భోగవస్తువులుగా చూస్తున్న పరిస్థితుల్ని ప్రస్తావించారట! ‘‘జగర్‌నాట్ బుక్స్ ప్రచురణ సంస్థ వారు నా దగ్గరకు వచ్చి, ఈ కోవలో ఉండే డజను ప్రణయకథలు రాయాల్సిందిగా అడిగారు.
దాన్ని ఓ సవాలుగా తీసుకొన్నా. ఇవన్నీ రాయడానికి నాకు 3 నెలలు పట్టింది’’ అని సన్నీ చెప్పారు. మరి, రచయిత్రిగా కొత్త వేషంలో స్థిరపడడానికి ఆమె ఎంత శ్రమించారు? ‘‘మొట్టమొదట రాసింది కాబట్టి, ‘7ఇ’ అనే కథకు చాలా కష్టపడాల్సి వచ్చింది. రచనాశైలిని పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇవన్నీ చిన్నకథలు కాబట్టి, ఒక్కోసారి కథ మొదలుపెడుతూనే అసలు విషయం లోకి వచ్చేయాల్సి ఉంటుంది.
ఇది నిజంగా సవాలే! ఒక్కసారిగా హడావిడి గా ముందుకు వెళితే, పాఠకుడు గందరగోళపడే ప్రమాదం ఉంటుంది. అలా లేకుండా, అతణ్ణి చదివించేలా చేయడం కత్తి మీద సాము’’ అని ఆమె అన్నారు. ఇంతకీ, ఈ కథలకూ, సన్నీ నిజజీవితానికీ ఏమైనా లింక్ ఉందా అని సహజంగానే చాలామందికి అనుమానం. ‘‘నా నిజజీవితానికి సంబంధం లేదు. ఈ కథలన్నీ పూర్తిగా కల్పితం. ఇవన్నీ ప్రలోభపెట్టి, ప్రణయంలోకి దింపే కథలే అయినప్పటికీ, ఎక్కడా హద్దులు దాటలేదు. పాఠకులకు, ముఖ్యంగా మహిళా పాఠకులకు అసౌకర్యం అనిపించకుండా జాగ్రత్తపడ్డా.
కొద్దిగా రొమాంటిక్‌గా అనిపించినా, ఆడవాళ్ళు ఎలాంటివి చదవడానికి ఇష్టపడతారనుకున్నానో అలాంటివే రాశా’’ అని అన్నారు. ఈ కథల పుస్తకం ప్రస్తుతానికి ‘ఇ-బుక్’ రూపంలో అందుబాటులోకి వస్తోంది. ప్రచురణకర్తలకు చెందిన ‘జగర్‌నాట్ యాప్’లో ప్రతి రాత్రీ 10 గంటలకు ఒక్కో కథ చొప్పున మే 3వ తేదీ దాకా విడుదల చేయనున్నారు. సన్నీకి సినిమాలు, పాటల రిలీజ్‌లు బాగా అలవాటే కానీ, ఈ కథల సంపుటి రిలీజ్ మాత్రం కొత్తగా ఉంది. ‘‘సినిమాలు వేరు, ఈ కథలు వేరు. రచన అనేది మనసుకు దగ్గరైన వ్యక్తిగత విషయం కదా! నాకు కాస్తంత భయం వేస్తోంది’’ అని ఆమె అన్నారు.