
తన పేరుతో అభ్యంతరకర వార్తలను ప్రచురిస్తూ.. మానసికంగా వేధిసున్నాడంటూ ఫ్లిన్ రెమెడియోస్ అనే వ్యక్తిపై సూపర్ మోడల్, మాజీ ఫెమినా మిస్ ఇండియా నటషా సూరి ముంబై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన లాయర్ మాధవ్ వి. తోరత్‌తో కలిసి దాదర్ పోలీసు స్టేషన్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. తన పేరుతో పబ్లిక్ వెబ్‌సైట్లలో అసభ్యకరమైన పోస్టులను ప్రచురిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘2019లో నవంబర్‌లో ఎవరో నకిలీ వార్తా కథనాలను సృష్టించి వాటిని నా పేరుతో ప్రచురించడం మొదలు పెట్టారు. మొదట్లో వాటిని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కూడా ఇలాంటివి చాలా వచ్చాయి. ఎవరో కావాలనే ఇలా చేశారనుకున్న. క్రమంగా అవి తారస్థాయికి చేరాయి. ఏకంగా నా పేరు మీద నకిలీ ట్విటర్ ఖాతాలను తెరిచి... అభ్యంతరకర వార్తలకు బాత్‌రూంలో ఉన్న అసభ్యకర అమ్మాయిల ఫొటోల ముఖాన్ని బ్లర్ చేసి వాటికి నటషా సూరి సింగ్ అనే పేరుతో షేర్ చేశాడు. దీన్నిబట్టి చూస్తే అతను నన్న లక్ష్యంగా చేసుకుని.. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నట్లుగా నాకు అర్థమైంది. అలాగే పోర్న్‌సైట్లలో తల లేని శరీరాన్ని తీసుకుని వాటిని నా పేరుతో ప్రచురించడంతో గూగుల్‌లో ఆ ఫొటోలు నా పేరుతో వస్తున్నాయి’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా బిగ్ బాస్ 13 కంటెస్టెంట్ సిద్దార్థ శుక్లా తనను వేధిస్తన్నట్లు.. ప్లిన్ నకిలీ వార్తలు ప్రచారం చేశాడని నటాషా పోలీసులకు తెలిపారు. ‘నా జీవితంతో ఇంతవరకు నేను శుక్లాను కలవనే లేదు. అతనెవరో కూడా నాకు తెలియదు’ అని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే ఆ వ్యక్తి కావాలనే తనను వివాదాల్లోకి లాగుతున్నాడని అర్థమైందన్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసెందుకే కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక నటషా 2006లో ఫెమినా మిస్ ఇండియా (వరల్డ్) టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలో టాప్-10లో ఆమె నిలిచారు. ఆ తరువాత 2016లో వచ్చిన మలయాళ ‘కింగ్ లయర్’ చిత్రంలో నటించారు. దాంతో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లలో కూడా నటించారు.