
సూపర్‌స్టార్‌తో మరోసారి!
ఎందిరన్-2కు సన్నాహాలు జరుగుతున్నాయా? సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో...
ఎందిరన్-2కు సన్నాహాలు జరుగుతున్నాయా? సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో మాజీ ప్రపంచసుందరి మరోసారి జోడీ కట్టనున్నారా? బ్రహ్మాండ చిత్రాల సృష్టికర్త శంకర్ ఈ క్రేజీ జంటతో మరోసారి సెల్యులాయిడ్‌పై వండర్స్ సృష్టించడానికి సిద్ధమవుతున్నారా? వీటన్నింటికీ స్పష్టమైన సమాచారం రాకపోయినా, ఆ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. ఎందిరన్ రజనీకాంత్ కెరీర్‌లో అత్యంత వసూళ్లు సాధించిన చిత్రం. అలాంటి చిత్రం కొనసాగింపుపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది.
దర్శకుడు శంకర్ ఏ విషయాన్ని తుది రూపం దాల్చేవరకు బహిరంగ పరచరు. తన చిత్రాల విషయాల్లోనూ చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తారు. అలాగే ఐ చిత్రం తరువాత చేసే చిత్రం గురించి ఇంతవరకు నోరు మెదపలేదు. కథాచర్చలు జరుగుతున్నాయన్నమాటే ప్రస్తుతానికి ఆయన నోట పలుకుతున్న మాట. అయితే ఆయన ఇటీవల సూపర్‌స్టార్‌ను కలిసినట్లు ఎందిరన్-2 చిత్ర విషయమై చర్చలు జరిపినట్లు కోలీవుడ్‌వర్గాల భోగట్టా. ఎందిరన్ సీక్వెల్‌కు రజనీ కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
కాగా ఈ చిత్రంలో ఆయన సరసన నటించే కథా నాయకి ఎవరన్న చర్చ వచ్చినప్పుడు పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినా, చివరికి ఎందిరన్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ పేరే ఫైనల్‌కు వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం స్టార్ డైరక్టర్ శంకర్ ఆ అందాల సుందరిని ముగ్గులోకి దింపే పనిలో ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఐశ్వర్యరాయ్ కూడా సూపర్‌స్టార్‌తో మరోసారి నటించడానికి సుముఖంగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాల మాట. కాగా ఎందిరన్ చిత్రం తమిళం, తెలుగు వంటి భాషల్లో విజయం సాధించినా బాలీవుడ్‌లో ఆశించిన ప్రజాదరణను పొందలేదు. ఈసారి దక్షిణాది సినీ అభిమానులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించే విధంగా రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ఖాన్‌ను ఎందిరన్ సీక్వెల్‌లో నటింపజేసే పనిలో శంకర్ ఉన్నట్లు సమాచారం.