
2.ఓ చిత్ర యూనిట్‌కు షాక్
2.ఓ చిత్ర యూనిట్ షాక్‌కు గురైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ.స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న మరో అద్భుత సెల్యులాయిడ్ సృష్టిగా దీన్ని భావించవచ్చు. ఎమీజాక్సన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
లైకా సంస్థ 350 కోట్ల అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.ఇటీవల చెన్నైలో పలు కీలక సన్నివేశాలతో పాటు బ్రహ్మాండమైన ఒక ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటోంది.
తన చిత్రానికి సంబంధించి దర్శకుడు శంకర్ ప్రతి అంశం గురించి తగు జాగ్రత్తలు తీసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక కథ, సన్నివేశాలు, పాత్ర దారుల ధరించే దుస్తుల నుంచి ప్రతి విషయం చిత్రం విడుదలయ్యే వరకు బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. అందులో భాగంగా చిత్రంలో పని చేసే వారెవరూ షూటింగ్ స్పాట్‌లో సెల్‌ఫోన్లు వాడరాదని షరతులను విధిస్తారు. చిత్రానికి సంబంధించిన ఏ ఒక్క స్టిల్‌ఫొటో కూడా తన అనుమతి లేకుండా మీడియాకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
సెట్‌లో ఎవరూ ఫొటోలు తీయరాదనే సెల్‌ఫోన్ల వాడకాన్ని బహిష్కరించడానికి ఒక కారణం. అయితే అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా 2.ఓ చిత్రంలో నటిస్తున్న విలన్ అక్షయ్‌కుమార్ గెటప్ తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడం ఆ చిత్రం యూనిట్‌ను షాక్‌కు గురి చేసింది. అక్షయ్‌కుమార్ కాకి రూపాన్ని పోలిన భయంకరమైన డెవిల్‌లా కనిపించే 2.ఓ చిత్రంలోని ఫొటోలు లీక్ అయ్యాయి.అయితే ఈ స్టిల్స్ చూస్తుంటే 2.ఓ చిత్రంపై అంచనాలు మరింత పెరిగేవిగా ఉన్నాయని చెప్పవచ్చు.