
సూర్య జోక్యం చేసుకుంటే...
సూర్య వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో ఒక చిత్రం తెరకెక్కడానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్ర కథపై సూర్య జోక్యం చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న విషయం దర్శకుడు వెంకట్ ప్రభు భయానికి గురి చేస్తోందట. దీనికి కారణాలు లేకపోలేదు. అజిత్ హీరోగా మంగాత్తా, కార్తీ హీరోగా బిరియాని చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను తయారు చేసే పనిలో తనమునకలైన వెంకట్ ప్రభు ఎట్టకేలకు కథను ఒక కొలిక్కి తీసుకొచ్చారు.
సాధారణంగా స్క్రిప్ట్ విషయంలో చాలా సమయం తీసుకునే వెంకట్ ప్రభు సూర్య కోసం తక్కువ సమయంలోనే కథ సిద్ధం చేశారు. ఈ విషయం సూర్య చెవిన వేయగా వెంటనే షూటింగ్‌కు రెడీ అవ్వమని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నారు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం అంజాన్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న సూర్య, వెంకట్ ప్రభు నుంచి సింగిల్ లైన్ స్క్రిప్ట్‌ను విన్నారట. పూర్తి కథను వినలేదట. కథ పూర్తిగా విన్న తరువాత ఆయన జోక్యం చేసుకుని ఎలాంటి మార్పులు చేయమంటారోనని వెంకట్ ప్రభు భయపడుతున్నారట. ఆయన భ యానికి కారణం ఇంతకు ముందు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయిన సూర్య ఆ తరువాత ఆయన పూర్తి కథ సిద్ధం చేయలేదంటూ వైదొలిగారు. అలాగే వెంకట్ ప్రభు కథ బాగాలేదంటారేమోనని ఆయన భయపడుతున్నారట. ఈ చిత్రం జూన్ లో సెట్‌పైకి వెళ్లనుందట.