సాక్షి, చెన్నై : దిల్లున్న దర్శకుడు సుశీంద్రన్. తొలి చిత్రం వెన్నెలా, కబడ్డీ,కుళ్లు నుంచి ఆయన చిత్రాలను పరిశీలిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థం అవుతుంది. తాజాగా సుశీంద్రన్ మరోసారి సాహసం చేసి తెరకెక్కించిన చిత్రం నెంజిల్ తుణివిరుందాల్. గుండెల్లో దమ్ముంటే అనే అర్థంతో రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్‌కిషన్, సాధిక హీరోహీరోయిన్లగా నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో మెహ్రీన్, విక్రాంత్, అప్పుకుట్టి, హరీష్ ఉత్తమన్, వినోద్‌కిషన్, మహేంద్రన్, అరుళ్‌దాస్, దిలీపన్ నటించారు.
అన్నై ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని, లక్ష్మణ్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక సత్యం థియేటర్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు కార్తీ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ దర్శకుడు సుశీంద్రన్ తో కలిసి నాన్ మహాన్ అల్ల చిత్రం చేశానన్నారు. ఈ చిత్ర కథను దర్శకుడు సుశీంద్రన్ వినిపించినట్లు మరో దర్శకుడి నుంచి తాను వినలేదన్నారు.
అంత చక్కగా కథను వినిపించారని చెప్పారు. ఈ చిత్ర సంగీతదర్శకుడు డి.ఇమాన్ గుర్తు పట్టలేనంతగా మారిపోయారని, జీవీ.ప్రకాశ్‌కుమార్‌ల చాలా స్మార్ట్‌గా తయారయ్యారని ప్రశంసించారు.ఆయన సంగీత దర్శకత్వంలో తానింత వరకూ పని చేయలేదని, త్వరలోనే అలాంటి అవకాశం రానుందని తెలిపారు. ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత కార్తీ సుశీంద్రన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారన్న గమనార్హం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు సుశీంద్రన్ ను దిల్లున్న దర్శకుడిగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment