తెలుగు చిత్రపరిశ్రమలో ఓ నిబంధన ఉంది! అదేంటంటే... షూటింగుల్లో జూనియర్ ఆర్టిస్టులుగా ఇక్కడి వారినే, అంటే... మన తెలుగువాళ్లనే తీసుకోవాలనే నిబంధన! కానీ, ఇప్పుడు చిరంజీవి ‘సైరా’ టీమ్ త్వరలో ప్రారంభం కానున్న షూటింగ్ కోసం విదేశాల నుంచి రెండువందల మంది జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారట! మరి, ఇదేంటి అంటే... ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందుతోన్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.
ఉయ్యాలవాడ ఎవరికి వ్యతిరేకంగా పోరాడారు? బ్రిటీషర్లకు! వాళ్లతో యుద్ధ సన్నివేశాలు, పోరాటాలు అంటే తెల్లతోలు జూనియర్ ఆర్టిస్టులే కావాలి కదా! అందువల్లే, విదేశాల నుంచి జూనియర్ ఆర్టిస్టులను రప్పిస్తున్నారట! సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల 6న హైదరాబాద్‌లో మొదలవుతోందని సమాచారమ్. పది రోజుల పాటు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి, బ్రిటీషర్లకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తారట. నయనతార కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు చేయనున్న సంగతి తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment