Chiranjeevi Speech: Sye Raa Narasimha Reddy Pre Release Event | ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా - Sakshi
Sakshi News home page

ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా సైరా: చిరంజీవి

Published Mon, Sep 23 2019 1:33 AM | Last Updated on Tue, Sep 24 2019 10:35 PM

chiranjeevi speech sye raa narasimha reddy pre release event - Sakshi

‘‘సెప్టెంబర్‌ 22 నా జీవితంలో అద్భుతమైనటువంటి ల్యాండ్‌ మార్క్‌. 1978 సెప్టెంబర్‌ 22న నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. ఓ వైపు టెన్షన్‌.. మరోవైపు ఎగ్జయిట్‌మెంట్‌.. ఇలా రకరకాల అనుభూతులతోటి నేను నేలమీదలేనంటే ఒట్టు. ఇన్నేళ్ల తర్వాత అలాంటి అనుభూతి ఈరోజు భావిస్తున్నానన్నది వాస్తవం. దానికి కారణం ‘సైరా నరసింహారెడ్డి’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 2న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఏ కథ అయినా అనుకుని అద్భుతంగా అల్లుకుని సెట్స్‌పైకి తీసుకెళతాం. కానీ, ‘సైరా’ అలాంటిది కాదు. దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం నుంచి ఇది నా మదిలో మెదులుతూ ఉంది. దానికంటే 25 ఏళ్లకి ముందు ‘మీరు చేయాల్సిన పాత్రలేమైనా ఉన్నాయా?’ అని అడిగితే ఎప్పుడూ అంటుంటాను. స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలి.. ప్రజల్లో శాశ్వితంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి.. నా కెరీర్‌కి అది బెస్ట్‌ పాత్ర అవ్వాలి అది భగత్‌సింగ్‌’ అంటూ నేను చెప్పుకుంటూ వచ్చేవాణ్ణి. కానీ ఎందుకో భగత్‌సింగ్‌ పాత్రని రచయితలు, దర్శకులు, నిర్మాతలు తీసుకురాలేదు.. దాంతో ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది.

ఆ తర్వాత, పుష్కరానికి ముందు పరుచూరి బ్రదర్స్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. ఆయన గురించి కర్నూలుతో పాటు చుట్టుపక్కన ఉన్న జిల్లాల్లోని కొందరికి తప్ప ఆయన గురించి ఎవరికీ తెలియదు. ఆ టైమ్‌లో నాకూ పెద్దగా తెలియలేదు. నాకు తెలిసినవారిని అడిగినా మాకూ తెలియదన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని పేజీలు, బుర్ర కథలు, ఒగ్గు కథలున్నాయి తప్ప ఆయన గురించి పెద్దగా ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ, కథ విన్నప్పుడు అద్భుతమైన కథ, ఓ గొప్ప యోధుడు అనిపించింది. తెరమరుగైపోయిన, తొలి స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి కథని అందరికీ తెలియజేయాలని సినిమా తీశాం.

1857లో సిపాయుల తిరుగుబాటు వచ్చినప్పుడు మంగళ్‌పాండే, ఝాన్సీ లక్ష్మీభాయ్‌ గురించి తెలుసు. ఆ తర్వాత ఆజాద్, భగత్‌సింగ్, నేతాజీ... ఇలా ఒక్కరేంటి.. మహాత్మాగాంధీ వరకూ ఎంతో మంది యోధులు, త్యాగమూర్తుల గురించి పుస్తకాల్లో చదివి తెలుసుకున్నాం. అయితే మన తెలుగువాడైన నరసింహారెడ్డివంటివారి కథ తెరమరుగైపోకూడదు అని మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది. ఇలాంటి కథ కోసమే కదా ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను.. మనం సినిమా చేస్తున్నాం అని పరుచూరి బ్రదర్స్‌కి చెప్పా. అయితే ఈ కథని తెరకెక్కించి న్యాయం చేయాలంటే బడ్జెట్‌ సమస్య అని మాకందరికీ అనిపించింది. పది–పదిహేనేళ్ల కిత్రం నాపై 30–40 కోట్లతో సినిమాలు తీసే రోజుల్లో ‘సైరా’ సినిమాకి 60–70 కోట్లపైన అవుతుంది.


ఏ నిర్మాత ముందుకు రాలేడు.. చేయమని మనం అడగలేం. ఎందుకంటే నష్టపోయే పరిస్థితి. కానీ, చూద్దాం.. చేద్దాం..  రాజీపడలేం అనుకున్నాం. ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో ఆగిపోయింది. కానీ, నా 151వ సినిమాగా ‘సైరా’ చేస్తే ఎలా ఉంటుందన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టింది, ఇన్‌డైరెక్ట్‌గా సపోర్ట్‌ చేసింది దర్శకుడు రాజమౌళి. ఆయన ‘బాహుబలి’ తీసి ఉండకపోతే ఈరోజు ‘సైరా’ వచ్చుండేది కాదు.. మన తెలుగు సినిమాకి భారతదేశమంతా ఓ దారి వేశారాయన. ఇన్ని వందల కోట్లు మనం ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు.. నిర్మాతలకి నష్టం లేకుండా చూడొచ్చు అని భరోసా ఇచ్చాడు రాజమౌళి. శభాష్‌.. హ్యాట్సాఫ్‌ టు రాజమౌళి. ‘ఇంతఖర్చు పెట్టి రిస్క్‌ చేయమని ఎవరికైనా ఎందుకు మనం చెప్పాలి.. రాజీ పడకుండా మనమే చేద్దాం’ అని చరణ్‌ అనడంతో సై అన్నాను.

ఈ కథని ఎవరు డైరెక్ట్‌ చేస్తారంటే.. నాపైన నమ్మకం ఉన్న పరుచూరి వెంకటేశ్వరావుగారు ‘మీరే చేయండి’ అన్నారు. నటిస్తూ దర్శకత్వం చేయడం కష్టం. దర్శకత్వం చేయలేక కాదు. దేన్నో ఓ దాన్ని వదిలేయాలి.. దేన్ని వదిలేయమంటారు? అడిగితే.. నరసింహారెడ్డిగా మిమ్మల్నే ఊహించుకున్నాం.. డైరెక్టర్‌ని వేరేవారిని పెట్టుకుందాం అన్నారు. సరే ఎవరు? అనుకుంటుంటే ‘ధృవ’ చేసిన అనుభవంతో మన సురేందర్‌ రెడ్డి అయితే బావుంటుంది అని చరణ్‌ అన్నాడు. సరే అన్నాను. ఈ విషయం సురేందర్‌కి చెబితే ఎగిరి గంతేస్తాడని అనుకుంటే ‘నాకు కొంచెం టైమ్‌ కావాలి సర్‌’ అన్నాడు. ఆ మాట మమ్మల్ని నిరుత్సాహానికి గురిచేసింది.

వారం తర్వాత వచ్చి చేస్తాను సర్‌ అన్నాడు. కర్నూలుకు వెళ్లి నరసింహారెడ్డిగారి గురించి సమాచారం సేకరించి, మూడు వారాలు గోవాలో ఉండి స్టోరీ రెడీ చేసుకొచ్చాడు. వాస్తవ కథను ఎక్కడా వక్రీకరించకుండా కమర్షియలైజ్‌ చేసిన తనకు హ్యాట్సాఫ్‌. ఈ పాత్రలో ఎంతో కష్టం ఉంటుంది. నేనేమో డూప్‌ని ఒప్పుకోను. నా అభిమానులు అస్సలు ఒప్పుకోరు. ‘సైరా’ లో శారీరకంగా నన్ను ఎంతో హింస పెట్టి యాక్షన్‌ సీక్వెన్స్‌ని రాబట్టారు. ఒక్కసారి మేకప్‌ వేసుకుని, కత్తి చేతబట్టుకుని గుర్రం ఎక్కాక నా వొళ్లు మరచిపోతాను.. నా వయసూ మరచిపోతాను.. నాకు గుర్తొచ్చేది నా భిమానులు మాత్రమే. అక్కడ గుర్తొచ్చేది నా ఇమేజ్‌ మాత్రమే. 25ఏళ్ల కిత్రం జోష్‌ ఉండేది. ఆ ఉత్సాహాన్ని ఇచ్చేది ఒకటి ఆ పాత్ర.. రెండోది అభిమానులు.

‘సైరా’వంటి సినిమా చేయడం ఆ భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం.. మీకు చూపించడం ఎంతో పుణ్యం. ఇండస్ట్రీకి, తెలుగువారికి, ఆ సినిమా చేసిన వారికి గౌరవాన్ని తీసుకొచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంత గౌరవాన్ని తెచ్చిన సినిమా ‘శంకరాభరణం’. ఆ తర్వాత కొన్ని సినిమాలు గౌరవాన్ని తీసుకొచ్చినా తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’. మనమంతా తెలుగువాళ్లం అని గర్వంగా చెప్పుకుంటూ కాలర్‌ ఎగరేసేలా గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ‘సైరా’ సినిమా కూడా అంత గౌరవాన్ని తెస్తుందనే ప్రగాఢ విశ్వాసం, నమ్మకం నాకుంది. నేను మాట్లాడేది గౌరవాన్ని గురించే.. విజయాన్ని గురించి ఇంకో సినిమాతో పోల్చట్లేదు.. ఇది గమనించాలి.

పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ‘సైరా’ సినిమాకి ఎంతో ఉపయోగపడింది. ఈ చిత్రంలో పాటలు, స్టెప్స్‌ ఉండకపోవచ్చు కానీ, ప్రతి ఒక్క యువతకి కనెక్ట్‌ అయ్యే సినిమా. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ‘సైరా’. మనమందరం భారతీయులుగా గర్వించాలి. ఇలాంటి సినిమాని నిర్మించినందుకు చరణ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.. ఓ కొడుకుగా కాదు.. ఓ నిర్మాతగా. సురేందర్‌ రెడ్డి అడిగినది ఏదీ కాదనకుండా, ధైర్యంగా ఖర్చుకు వెనకాడకుండా చేశాడు చరణ్‌. జార్జియాలో 45రోజుల పాటు పతాక సన్నివేశంలో వచ్చే యుద్ధం చేశాం. దానికి 75కోట్లు ఖర్చు అయింది. ‘ఎంత లాభాలు పొందామన్నది కాదు. రామ్‌చరణ్‌–సురేందర్‌ రెడ్డి ఎంత గొప్ప సినిమా తీశారన్నది కావాలి’ అన్నాడు.

ఒక్క ఫోన్‌ చేయగానే నా గురువుపాత్ర చేసేందుకు ఒప్పుకున్న అమితాబ్‌గారికి కృతజ్ఞతలు. జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి, నయనతార, తమన్నా.. ఇలా అందరూ ‘సైరా’ లో భాగమవ్వాలని నటించారు. ఈ సినిమాలో నేను ఇంత గ్లామర్‌గా ఉన్నానంటే ఆ క్రెడిట్‌ కెమెరామన్‌ రత్నవేలుగారిదే. అక్టోబర్‌ 2న గాంధీగారి 150వ జయంతి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆ రోజున సినిమాని విడుదల చేసేందుకు ముందుకు వెళుతున్నామంటే ఇందుకు దోహదం చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’అన్నారు. పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ– ‘‘సైరా’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఒక అతిథిగా నన్ను పిలవడం నా అదృష్టం. బయట నా పేరు.. ఇమేజ్‌.. ఇవన్నీ నాకు తెలియదు కానీ అన్నయ్య దగ్గరకి వచ్చే సరికి నేను ఒక అభిమానిని.

ఈ రోజు మీ(అభిమానులు) ముందు ఈ స్థాయిలో ఉండి మాట్లాడటానికి కారణం అన్నయ్య నేర్పించిన పాఠాలే. ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అన్నయ్య. నేను మద్రాసులో ఉన్నప్పుడు దేశం గర్వించే సినిమాలు అన్నయ్య చేయాలని కోరుకున్నాను. నాకు స్టార్‌డమ్‌ వచ్చినా అన్నయ్యతో  సినిమా చేయలేకపోయాను. నా ముందు పెరిగిన రామ్‌చరణ్‌ స్వార్థం చూసుకోకుండా ఇలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు నా అభినందనలు. కళ అనేది అద్భుతమైనది. అనేక పరిస్థితుల్లో అది రకరకాలుగా ఉద్భవిస్తుంటుంది. భారతదేశం తాలూకు గొప్పదనం చెప్పే సినిమా ఇది. మన దేశం ఇతర దేశాలమీద దాడి చేయలేదు. ప్రపంచ దేశాలవారు మన దేశంపై దాడి చేశారు. మరి.. భారతదేశం అంటే ఏంటి? ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వ్యక్తుల సమూహం భారతదేశం.

ఆయన ఎలా ఉండేవారో, ఎలా పోరాటం చేశారో పుస్తకం చదివితే అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని కోట్ల మంది ఒక అనుభూతిలోకి రావాలి అంటే ఇలాంటి సినిమాలు రావాలి. భగత్‌సింగ్, చంద్రశేఖర్‌ ఆజాద్, మహాత్మాగాంధీ, పటేల్, అంబేద్కర్‌ వంటి గొప్ప మహనీయుల త్యాగాలను మనం గుర్తు పెట్టుకోవాలి. ఉయ్యాలవాడ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక వినోదం కోసం మాత్రమే కాదు. ఇలాంటి ఒక చరిత్రను తెరకె క్కించడానికి చాలా కష్టపడాలి. రక్తాలు ధారపోసి, ప్రాణాలు అర్పించిన ఎందరో స్వాతంత్య్ర సమర యోధుల త్యాగఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం. అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. 

ఇది ఎప్పుడు నేర్చుకున్నాను అంటే... అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తర్వాత బలమైన స్టార్‌డమ్‌ స్టార్ట్‌ అయినప్పుడు.. ఒక తమ్ముడిగా మా అన్నయ్య పెద్ద హీరో అని అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు... ఎన్టీఆర్‌గారి సినిమారాగానే... ‘విశ్వామిత్ర’ అనుకుంటా... అది అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఆ రోజు నాకు అర్థం అయ్యింది. ఒక వ్యక్తి తాలూకు అనుభవాన్ని ఎప్పుడూ తీసివేయలేం. అలాగే చిరంజీవిగారి అనుభవాన్ని... ఎంతమంది కొత్తవారు వచ్చినా కానీ, ఎంతమంది రికార్డులు బద్దలు కొట్టినా కానీ.. అంటే ఆయన అనుభవాన్ని మనం కొట్టేయలేం. అందుకే నాకు సీనియర్స్‌ అంటే చాలా గౌరవం. ‘సైరా:నరసింహారెడ్డి’ సినిమాను భారతదేశం గర్వించే చిత్రంగా చేయడం చాలా గర్వంగా ఉంది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగారు అంటే చిరంజీవిగారే గుర్తొచ్చారు. సురేందర్‌ రెడ్డిగారు చాలా బాగా తెరకెక్కించారు. పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమా కోసం కలలు కన్నారు. నేను నటించకముందు ‘శుభలేఖ’ లో ఒక డైలాగ్‌కి డబ్బింగ్‌  చెప్పాను. ఆ తర్వాత మళ్లీ నా గళం ఇచ్చింది ‘సైరా’ చిత్రానికే. మన దేశం కోసం,  ప్రజల కోసం తీసిన సినిమా ఇది. అందుకే నా గొంతను గర్వంగా, మనస్ఫూర్తిగా ఇచ్చాను. ‘సైరా’లాంటి సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు సంతోషంగా ఉంది. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిగారు ఇక్కడి రావడం నిజంగా సంతోషం.

ఎవరు ఎన్ని విజయాలు సాధించినా మాకు అసూయ కలగదు. ఇంకా ఆనందపడతాం. ఎందుకంటే పదిమంది బాగుండాలని కోరుకునేవాళ్లం మేము. రాజమౌళిగారు రికార్డులు బద్దలు కొడితే ఆనందంగా ఉంటుంది. సురేందర్‌రెడ్డిగారు కూడా రికార్డులు బద్దలుకొడితే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సినిమా. మన జాతి. మన భారతజాతి. మన తెలుగుజాతి. మనం ఎక్కడికి వెళ్లినా.. ఇండియా అనేది బ్రిటిష్‌ వారు పెట్టిన పేరు. భారతదేశం అనేది మనది. భారతీయులుగా  మనం గర్వించేలా సినిమా తీసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు ధన్యవాదాలు’’ అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘ఈ వేదికపై చాలా మంది గొప్పవారు ఉన్నారు. ఈ సినిమాలో పనిచేసిన వారు కాకుండా ఈ సినిమాను చూసిన మొట్టమొదటి ప్రేక్షకుడిని నేను. సూపర్‌హిట్‌ సినిమా. ఇన్ని రోజులు, ఇంత ఖర్చు పెట్టి తీశారు. సినిమా ఎలా వచ్చిందో అని చాలా భయంతో చూసి, చిరంజీవిగారిని కౌగిలించుకున్నాను. నాకు దుఃఖం వచ్చినంత పని అయ్యింది. ఇంత గొప్ప సినిమా తీసినందుకు చిరంజీవిగారి కన్నా... రామ్‌చరణ్‌పై ఓ ఎమోషనల్‌ ఫీలింగ్‌ వచ్చింది. చిరంజీవిగారితో ఇన్ని సినిమాలు తీసిన నేను, ఇలాంటి ఓ సినిమా తీయలేకపోయానే అనే ఒక బాధ కలిగింది. రెండో సినిమాతోనే చరణ్‌ గొప్ప సినిమా తీశాడు’’ అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ స్టేజ్‌పై నేను చెప్పే మాటలు నా లోని భావాలను తెలియజెప్పలేవు. ‘సైరా’ షూట్‌ చేసిన ప్రతిరోజు టీమ్‌కి  థ్యాంక్స్‌ చెబుతూనే ఉన్నాను. అందరి సహకారం లేకపోతే నాన్నగారి ఈ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమాలో నటించినవారికి, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అన్నారు. డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి మాట్లాడుతూ–‘‘సైరా’ సినిమా కోసం 215 రోజులు ఓ కుటుంబంలా  సాంకేతిక నిపుణలందరూ కష్టపడి పనిచేసినందుకు థ్యాంక్స్‌. చిరంజీవిగారి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ ఇచ్చి సపోర్ట్‌గా ఉంటూ ఫ్రీడమ్‌ ఇచ్చి ముందుకు నడిపించిన రామ్‌చరణ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.

డైరెక్టర్‌ కొరటాల శివ మాట్లాడుతూ – ‘‘సైరా’ షూటింగ్‌ మధ్యలో ఉన్నప్పుడు రామ్‌చరణ్‌గారు కొన్ని రషెష్‌ చూపించారు. సినిమా అండర్‌ ప్రొడక్షన్‌లో ఉండగానే అంత పాజిటివ్, అంత బ్లాక్‌బస్టర్‌ టాక్‌ ఈ ఒక్క సినిమాకే సాధ్యం. ఇలాంటి గొప్ప కావ్యమైన సినిమా తీసినందుకు సురేందర్‌రెడ్డిగారికి ఇది గొప్ప అవకాశం.. అదృష్టం. జనరల్‌గా తండ్రి నిర్మాత అయితే కొడుకు నటిస్తాడు.. ఇక్కడ మాత్రం కొడుకు నిర్మాత అయితే తండ్రి నటించడం చూడ్డానికే చాలా ఆనందంగా ఉంది. ‘సైరా’ సినిమా నిజంగా చాలా సంచలనం అవుతుంది’’ అన్నారు. ‘‘నా తొలి తెలుగు సినిమా చిరంజీవిసర్‌తో చేయడం సంతోషంగా ఉంది. రామ్‌చరణ్, సురేందర్‌ రెడ్డి సార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు నటుడు విజయ్‌ సేతుపతి.

డైరెక్టర్‌ రాజమౌళి మాట్లాడుతూ– ‘‘ఇంతపెద్ద సినిమా, ఇంత చారిత్రాత్మక సినిమా వేడుక ఈ రోజు ఇక్కడ జరుగుతోందంటే మనం గుర్తించుకోవాల్సింది, అభినందించాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది పరుచూరి బ్రదర్స్‌కి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని ఎన్నేళ్లు వారి గుండెల్లో, మనసుల్లో మోశారో సినిమా రంగంలోని వారందరికీ తెలుసు. బ్రిటీష్‌వారిపై తొలిసారి పోరాడింది ఓ తెలుగు వీరుడు.. ఇది అందరికీ తెలియాలని వాళ్లు చాలా ఏళ్లు వేచిచూశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వాళ్ల కోరికని రామ్‌చరణ్‌ తీరుస్తున్నాడు. చరణ్‌.. ఇది మీ నాన్నగారికి ఇస్తున్న గిఫ్ట్‌ కాదు.. తెలుగువారందరికీ ఇస్తున్న గిఫ్ట్‌.. థ్యాంక్యూ. ఇలాంటి సినిమా తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు.

‘బాహుబలి’ లో 2300 వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌లు ఉంటే ‘సైరా’ లో 3800 షాట్స్‌ ఉన్నాయి. అన్ని షాట్స్‌ మధ్యలో ఎమోషన్స్‌ని వదలకుండా, మరచిపోకుండా చేశారు. ‘సైరా’ ట్రైలర్‌ చూడగానే సినిమాపై అందరికీ నమ్మకం వచ్చింది. ‘మగధీర’ స్టోరీ సిట్టింగ్స్‌లో వారం పాటు చిరంజీవిగారు ఉత్సాహంగా పాల్గొని చాలా సలహాలు ఇచ్చారు. కొన్ని ఇలా చేస్తే బాగుంటుందంటూ నటించి చూపించారు. అప్పుడు నాకు అనిపించింది. ఈ కథలో హీరోగా చరణ్‌ని ఊహించుకోకుండా ఆయన్నే ఊహించుకుంటున్నాడని నాకు అనిపించింది. ‘మగధీర’ విడుదలయ్యాక చిరంజీవిగారు చెప్పారు.. ‘రాజమౌళిగారు.. నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ, ‘మగధీర’ లాంటి సినిమా ఒక్కటి కూడా చేయలేదు’ అన్నారు. ఆ కోరికని ఇప్పుడు చరణ్‌ తీరుస్తున్నాడు’’ అన్నారు.

కథా రచయిత పరుచూరి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ –‘‘సైరా’ మా పదేళ్ల కల. ఈ కథని చాలామందికి చెప్పాం. చిరంజీవిగారు చేస్తాను అన్న తరవాత చాలా ఏళ్లు వెయిట్‌ చేశాం. న్యాయంగా చిరంజీవిగారి కోసమే చాలా మంది పెద్దవారు వదిలేసిన కథలా నేను భావిస్తుంటాను. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవిగారు నటించడం మన అదృష్టం. రామ్‌చరణ్‌ అత్యద్భుతంగా ఈ సినిమా తీశారు. ఆర్టిస్టుల నుంచి మంచి నటనను రాబట్టుకోగలరు సురేందర్‌రెడ్డి. ‘సైరా’ చిత్రం సూపర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు.  

మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ – ‘‘కృష్ణానగర్‌లో నేను అవకాశాల కోసం తిరుగుతుండేవాణ్ణి. ఓ రోజు అమ్మమ్మ ఫోన్‌ చేసి ‘అరేయ్‌.. చిరంజీవిని కలవరా.. ఆయన సినిమాకి ఒక్క డైలాగ్‌ అయినా రాయరా’ అనేది. ఆయన సినిమాకి మాటలు రాయడం ఏంటమ్మా.. అది జరిగేపనికాదు.. అలాంటి అవకాశాలు రావు.. ఆకాశాన్ని అందుకోమంటున్నావు అది జరిగేపని కాదు ఫోన్‌ పెట్టేయ్‌’ అని చెప్పేవాణ్ణి. అలాంటి నేను చిరంజీవిగారికి తొలిసారి ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమాకి, ఇప్పుడు ‘సైరా’ కి మాటలు రాశా. అవకాశం ఇచ్చిన చిరంజీవి, రామ్‌చరణ్, సురేందర్‌ రెడ్డిగార్లకు థ్యాంక్స్‌’’ అన్నారు. డైరెక్టర్‌ వీవీ వినాయక్‌ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమా రారాజు మా అన్నయ్య మెగాస్టార్‌.   ఈ సినిమా సూపర్‌హిట్‌ సాధించి చరణ్‌బాబు కలను, అన్నయ్యగారికి గొప్పగా గుర్తిండిపోయే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

కొణిదెల సురేఖ, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, డి.సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, కిరణ్, హీరోలు వరుణ్‌ తేజ్, సాయిధరమ్‌ తేజ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: వాకాడ అప్పారావ్, వైవీ ప్రవీణ్‌ కుమార్, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, సోదరీమణులు సుశ్మిత, శ్రీజ, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్, నటులు జగపతిబాబు, ‘థర్టీ ఇయర్స్‌’ పృథ్వీ, డైరెక్టర్‌ మెహర్‌ రమేశ్, కెమెరామన్‌ రత్నవేలు తదితరులు పాల్గొన్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement