రహస్య గూఢచారిగా...
కథానాయిక తాప్సీ ముంబయ్‌కి మకాం మార్చేసిన విషయం తెలిసిందే. అమె అక్కడ అడుగుపెట్టిన వేళావిశేషం బావుంది. ఎంత బాగుందంటే... బాలీవుడ్ కథానాయికలందరూ ఎదురుచూసేసువర్ణావకాశం ... ఏ కష్టం లేకుండా, తేలిగ్గా తాప్సీ తలుపు తట్టేంత. ఇంతకీ తాప్సీని వరించిన ఆ బంగారం లాంటి అవకాశం ఏంటనుకున్నారు? బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్‌కుమార్‌తో జతకట్టే అవకాశం. వివరాల్లోకెళితే... ‘స్పెషల్ 26’ లాంటి బ్లాక్‌బస్టర్‌ని తనకు అందించిన దర్శకుడు నీరజ్ పాండేతో మరో సినిమా చేయడానికి అక్షయ్ సంసిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా ఓ ఫ్రెష్ ఫేస్ ఉంటే బావుంటుందని అక్షయ్ భావించారట.
అదే తాప్సీ పాలిట వరమై కూర్చుంది. అక్షయ్-నీరజ్‌ల తాజా చిత్రానికి తాప్సీ కథానాయికగా ఖరారయ్యింది. మరో విషయం ఏంటంటే... ఇందులో తాప్సీ పాత్ర కూడా విభిన్నంగా ఉంటుందట. రహస్య గూఢచారిగా తాప్సీ ఇందులో కనిపించబోతున్నారు. ఈ యాక్షన్ అడ్వంచరస్ మూవీ.. అక్షయ్ అభిమానులు పండుగ చేసుకునే రీతిలో ఉంటుందని బాలీవుడ్ టాక్. ఇప్పటికే... బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘రన్నింగ్ షాదీ డాట్ కామ్’ అనే సినిమాలో నటిస్తోంది తాప్సీ. మరోవైపు ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘వెయ్ రాజా వెయ్’లో కూడా తాప్సీ నటిస్తోంది. ఇందులో తను నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేస్తోంది.