తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా... బాలీవుడ్‌లో మాత్రం తాప్సీ మంచి ఊపుమీదే ఉన్నారు.
తెలుగులో పెద్దగా సినిమాలు లేకపోయినా... బాలీవుడ్‌లో మాత్రం తాప్సీ మంచి ఊపుమీదే ఉన్నారు. వచ్చే జనవరి 23న అక్షయ్‌కుమార్‌తో ఈ ముద్దుగుమ్మ కలిసి నటించిన ‘బేబీ’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా విజయం సాధిస్తే... బాలీవుడ్‌లో తాప్సీ దశ తిరిగినట్లే. అసలు ఈ సువర్ణావకాశం ఈ ఢిల్లీభామకు ఎలా దక్కిందో తెలుసా? తాప్సీ ఉర్దూ బాగా మాట్లాడతారు. అదే తాప్సీకి వరమైంది. కథ రీత్యా ఇందులో కథానాయిక ఉర్దూ బాగా మాట్లాడాలి.
అందుకే దర్శకుడు నీరజ్ పాండే.. ఉర్దూ తెలిసిన అందమైన అమ్మాయి కోసం దేశం మొత్తం వెతికారట. చివరకు బంతి తాప్సీ గోల్‌లో పడింది. తాను సొగసుగా ఉర్దూ మాట్లాడటం చూసి పులకించిపోయిన నీరజ్... మరో ఆలోచన చేయకుండా ఆ పాత్రకు తాప్సీని ఎంచుకున్నారట. దీని గురించి తాప్సీ చెబుతూ- ‘‘నేను ఉత్తరాది అమ్మాయినే అయినా, ఆ యాస లేకుండా కేవలం ఉర్దూ యాసలోనే మాట్లాడగల సత్తా నాకుంది. చిన్నప్పట్నుంచీ ఉర్దూ మాట్లాడటం నాకు అలవాటే. నీరజ్ ఈ కథ అనుకున్నప్పుడు చాలామందిని కలిశారట. ఉర్దూ మాట్లాడగలిగిన అమ్మాయిలు మాత్రం ఆయనకు తారసపడలేదు.
చివరకు నన్ను కలిశారు. కష్టతరమైన కొన్ని ఉర్దూ పదాలను నా ముందుంచారు. నేను అలవోకగా చెప్పేశా. ఆ తర్వాత ఉర్దూ కవితల్ని చదవమన్నారు. తడుముకోకుండా చదివేశా. అలా ఈ సినిమా ఛాన్స్ నాకు దక్కింది. అక్షయ్‌కుమార్, రానా, డ్యానీ... ఇలా చాలామంది స్టార్లు ఇందులో నటించారు. ముఖ్యంగా అక్షయ్‌సార్‌తో నటించే ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం’’ అన్నారు.