మేం అప్పుడే ప్రేమలో పడ్డాం అంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ ఆడుగళం చిత్రంతో కోలీవుడ్‌కు అడుగు పెట్టింది. ఆ చిత్రం మంచి విజయాన్నే అందుకుంది. అయితే ఈ అమ్మడి కెరీర్ మాత్రం అనుకున్నంత వేగం పుంజుకోలేదు. అందుకు కారణం ఆ తరువాత ఆశించిన కమర్శియల్ విజయాలు తాప్సీ ఖాతాలో పడకపోవడమే. స్టార్ హీరోలతో నటించే అవకాశాలను రాబట్టుకోవడంలో ఈ బ్యూటీ ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. అలా చాలా కాలం కోలీవుడ్‌లో పోరాడి కాంచన చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.
అయినా ఆ తరువాత ఇక్కడ అవకాశాలు తాప్సీకి ముఖం చాటేశాయి. అయితే తెలుగులో ఈ ఈమె∙కెరీర్ కాస్త బెటర్‌గానే ఉండేది. తరువాత అక్కడా సినిమా వర్గాలు దూరం పెట్టడంతో బాలీవుడ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుతం గేమ్ ఓవర్ అనే ఒక ద్విభాషా చిత్రంలో నటిస్తున్న తాప్సీకి బాలీవుడ్‌లో అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే వ్యక్తిగతంగా తాను చాలా ఓపెన్ టైప్, తనకు కాస్త ధైర్యం కూడా ఎక్కువే అని చెప్పుకునే తాప్సీ సంచలన వ్యాఖ్యలు చాలానే చేసింది.
ఇటీవల చెన్నైలో ఒక భేటీలో పేర్కొంటూ ప్రేమ, పెళ్లి గురించి చాలా మంది అడుగుతున్నారని, ప్రేమ గురించి చెప్పాలంటే ఈ విషయంలో తాను కాస్త ఫాస్టేనని, 9వ తరగతి చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. ఈ విషయం లేట్‌గా చెబుతున్నానని, తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడు సహ విద్యార్థిని ప్రేమించానని చెప్పింది. అతను కూడా తనంటే ఇష్టపడ్డాడని, అయితే ఆ ప్రేమ ఎక్కువ కాలం సాగలేదని చెప్పింది.
10వ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయన్న సాకుతో ఆ అబ్బాయి విడిపోదాం అని చెప్పాడంది. ఆ రోజుల్లో సెల్‌ఫోన్లు లేవని, దీంతో ఒక రోజు తాను పబ్లిక్ ఫోన్ బూత్‌కు వెళ్లి అతనికి ఫోన్ చేసి తననెందుకు వదిలేశావ్ అని అడిగి ఏడ్చేశానని చెప్పింది. ఆ తరువాత అతన్ని తానూ చూడదలచుకోలేదని తెలిపింది. ఇక పెళ్లి అంటారా దేనికైనా సమయం రావాలి. ఆ తరుణం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెప్పి చేసుకుంటానని తాప్సీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment