బికినీ బేబీ... క్యా బాత్ హై!
దండయాత్ర... ముందు బికినీ అందాలతో, ఆ తర్వాత ‘బికినీలో ఏంటిది?’ అని ప్రశ్నించినోళ్లపై మాటల తూటాలతో! తాప్సీ దండయాత్ర చేసేశారు. దాంతో ట్విట్టర్ వేడెక్కింది. తాప్సీ నటించిన తాజా హిందీ సిన్మా ‘జుడ్వా–2’. ఇందులోని ఓ పాటలో తాప్సీ బికినీలో దర్శనమిచ్చారు. అదెప్పుడో (పాట) విడుదలైంది. నిన్నేమో పాటలో వేసుకున్న బికినీ స్టిల్స్ రెండిటిని తాప్సీ ట్వీట్ చేశారు. అప్పుడు మొదలైంది అసలు రచ్చ.
ట్విట్టర్‌లో కొందరు తాప్సీని తిడుతూ, వెక్కిరిస్తూ రెచ్చిపోయారంతే! తాప్సీ ఏం తక్కువ తినలేదు. అంతకు మించి... అనే రేంజ్‌లో వెటకారంగా రిప్లైలు ఇచ్చారు. ‘‘ఏం బట్టలవి. పరువు తీసేస్తున్నావ్! నీ సోదరుడు ఇది చూసి, ఎంత గర్వపడుతున్నాడో’’ అని ఓ వ్యక్తి తాప్సీని కామెంట్ చేస్తే... ‘‘సారీ! భాయ్ (సోదరుడు) లేడు. లేదంటే పక్కా అడిగి చెప్పేదాన్ని. ఇప్పటికి ఈ సోదరి ఇచ్చిన ఆన్సర్ చాలా?’’ అని తాప్సీ కౌంటర్ ఇచ్చారు.
‘‘చెత్త సినిమాలు చేసి, దేశ యువతను పాడుచేస్తున్నారు. కనీసం సోషల్ మీడియాలోనైనా ఇలాంటి చెత్త ఫొటోలు అప్‌లోడ్ చేయకు’’ అని ఇంకొకరు అంటే... ‘‘చెత్తా?? నా ఒంటికి అంటిన ఇసుక (బికినీ స్టిల్‌లో ఒంటికి అంటుకున్న ఇసుకను ఉద్దేశించి)ను శుభ్రం చేసుకోవల్సింది. నెక్ట్స్ టైమ్ జాగ్రత్తలు తీసుకుంటా. అందుకు క్షమించండి’’ అన్నారామె. అక్కడితో రచ్చ ఆగలేదు. కొందరు తాప్సీకి మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా రచ్చ మొదలెట్టారు. కానీ, తాప్సీ మాత్రం కామెంట్ చేయకుండా కామ్ అయిపోయారు. అంతే కదా... ఎంత మందికి ఆన్సర్స్ ఇస్తారు?