ఐ డోంట్ కేర్
తమిళసినిమా: ఆ మధ్య ఒక చిత్రంలోని పాట సన్నివేశంలో తన బొడ్డు మీద కొబ్బరి చిప్పలను వేశారని, ఆ దర్శకుడిని వెటకారంగా మాట్లాడిన వివాదాల్లో చిక్కుకున్న నటి తాప్సీ తాజాగా మరోసారి సోషల్‌మీడియాకు మంచి పని చెప్పింది. ఈ ఢిల్లీ భామకు దక్షిణాదిలో అవకాశాలు పూర్తిగా అడుగంటుకు పోయాయి. ఆ మధ్య లారెన్స్‌తో రొమాన్స్ చేసిన కాంచన చిత్రం విజయం సాధించడంతో మరిన్ని అవకాశాలు కోలీవుడ్‌లో వస్తాయని ఆశించింది.
అయితే అలా జరగలేదు. దీంతో మూటాముల్లు సర్దుకుని బాలీవుడ్‌కు మకాం మార్చింది. లక్కీగా అక్కడ నటించిన పింక్ , నామ్ షబానా వంటి చిత్రాలు విజయం సాధించడంతో తాప్సీకి హిందీలో గిరాకీ బాగానే పెరిగింది. ప్రస్తుతం అక్కడ రెండు మూడు చిత్రాల్లో నటిస్తోంది. తాప్సీ నటించిన జూడ్వా–2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అమ్మడి గ్లామర్ కుర్రకారును పిచ్చెకిస్తుందట.
ఈ మధ్య హీరోయిన్లు తమ గ్లామరస్ ఫొటోలను తమ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి ఫ్రీ పబ్లిసిటీని పొందడానికి అలవాటు పడిపోయారు. నటి తాప్సీ తక్కువేమీ తినలేదు. ఆ అమ్మడు అదే బాటను పట్టింది. తాను నటించిన జూడ్వా–2 చిత్రంలో ధరించిన టూ పీస్ దుస్తులతో కూడిన ఫొటోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అంతే కాదు నెటిజన్లు తాప్సీపై రకరకాల కామెంట్స్‌తో ఒక రకంగా ఆడేసుకుంటున్నారు. అయినా ఐడోంట్ కేర్ అంటూ ఈ రకం ప్రచారాన్ని తాప్పీ ఎంజాయ్ చేస్తోందట.