చెప్పి చెప్పి అలసి పోయాను
కోలీవుడ్‌లో ప్రాచుర్యం కోసం పాకులాడుతున్న కథా నాయికల్లో తాప్సీ ఒకరు. ఆడుగళం, వందాన్ వెండ్రాన్ తదితర చిత్రాల్లో నటించినా ఈ భామకు సరైన విజయం దక్కలేదు. ఇటీవల విడుదలైన ఆరంభం చిత్రంలో రెండో కథా నాయికగా నటించి ఆ చిత్ర విజయంతో కాస్త ఊరట చెందారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌లో రన్నింగ్ సౌదీ డాట్ కామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. పంజాబ్‌లోని బక్రా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన రాజమహల్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఆ రాజమహల్‌లో ఇప్పటికీ రాజవంశస్తులు నివసిస్తున్నార ట. దీని గురించి తాప్సీ తెలుపుతూ ఆ ప్యాలెస్‌లో పది రోజులు షూటింగ్ జరిగిందని, రాజకుటుంబీకులు తమను చాలా ప్రేమగా చూసుకున్నారని చెప్పారు. వారి పారంపర్య పంజాబ్ వంట కాలతో ప్రతిరోజు విందునిచ్చారని తెలిపారు.
రాజవంశస్తులైన ఎలాంటి వివక్ష చూపకుండా ప్రేమాభిమానాలను కురిపించారని పేర్కొన్నారు. హిందీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని లారెన్స్‌కు జంటగా గంగ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో తాను టీవీ సీరియల్ దర్శకురాలిగా నటిస్తున్నట్లు వివరించారు. ఇందులో తన పాత్ర ఆద్యంతం సీరియస్‌గానే ఉంటుందన్నారు. ఇలాంటి పాత్రకు లారెన్స్ తననెందుకు ఎంపిక చేశారో ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందన్నారు. మరో విషయం ఏమిటంటే డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మాథ్యాస్‌పోతో ప్రేమాయణం అంటూ తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు. బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు తాను మాథ్యాస్‌పోను క లుసుకున్నానన్నారు.
అప్పటి నుంచి తమ మధ్య స్నేహం కొనసాగుతున్న విషయం నిజమేనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తన గురించి పలు రకాల వదంతులు ప్రచారం అయ్యాయని వాటికి పలుమార్లు వివరణ ఇచ్చి అలసిపోయానని పేర్కొన్నారు. ఇకపై తన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికి ఎలాంటి ప్రశ్నకు బదులివ్వరాదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మాథ్యాస్ పోతో స్నేహం అనేది తన సొంత విషయం అని దీని గురించి ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వవలసిన అవసరం లేదని తాప్సీ రుసరుస లాడారు. అయితే ఏమీ లేనప్పుడు అంత ఉడుక్కోవడం దేనికీ అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.