చలి కాచుకుందామని వెళ్లి...!
‘సినిమావాళ్లు సుకుమారంగా ఉంటారు. కష్టం ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు. నిరంతరం లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంటారు’... చాలామంది అభిప్రాయం ఇదే.
‘సినిమావాళ్లు సుకుమారంగా ఉంటారు. కష్టం ఎలా ఉంటుందో వాళ్లకు తెలీదు. నిరంతరం లగ్జరీ లైఫ్‌ని అనుభవిస్తుంటారు’... చాలామంది అభిప్రాయం ఇదే. కానీ.. వారి జీవితం సుఖాలకు ఆలవాలం ఎంతమాత్రం కాదని, వారిక్కూడా లెక్కలేనన్ని కష్టాలుంటాయని, ఒక్కోసారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంటుందని బయటి వారికి తెలీదు. షూటింగుల్లో గాయాలపాలై చావు దరిదాపుల్లోకెళ్లి వచ్చిన కళాకారులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి టబు కూడా చేరారు. వివరాల్లోకెళితే... ప్రస్తుతం టబు ‘హైదర్’ అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ జమ్ముకాశ్మీర్‌లోని ఓ భయంకరమైన కొండ ప్రాంతంలో జరుగుతోంది.
శనివారం తెల్లారు జామున మైనస్ డిగ్రీల చలిలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు విశాల్‌భరద్వాజ్. షాట్ గ్యాప్‌లో ఓ పక్కకెళ్లి కూర్చున్నారు టబు. ఉన్నట్లుండి చలి తీవ్రత ఎక్కువైంది. దాంతో పక్కనే ఏర్పాటు చేసిన చలిమంటను ఆశ్రయించారు. ఆ మంటలోంచి పొగరావడం మొదలైంది. ఆ పొగను పీల్చి ఉక్కిబిక్కిరైపోయారు టబు. ఒకానొక దశలో శ్వాస సరిగ్గా అందలేదు. అక్కడిక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యారు. అయితే.. హాస్పిటల్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలస్యం చేయకుండా హుటాహుటిన ఉదయం 9 గంటలకల్లా టబుని హాస్పిటల్‌లో చేర్చారు. సమయానికి హాస్పిటల్‌కి చేర్చడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు. చికిత్స పూర్తి చేసి, ఆ రోజు సాయంత్రం టబుని డిశ్చార్చ్ చేశారు. దీన్ని బట్టి సినిమా వాళ్ల కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.