
చిరంజీవి, తమన్నా
‘వానా వానా వెల్లువాయె’ అంటూ ‘రచ్చ’ సినిమాలో చిరంజీవి రీమిక్స్ సాంగ్‌లో డ్యాన్స్ చేసిన తమన్నా ఇప్పుడు డైరెక్ట్‌గా చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసే ఛాన్స్ కొట్టేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార ఓ కథానాయిక. ఈ చిత్రంలో మరో హీరోయిన్‌కు స్కోప్ ఉండటంతో మిల్కీబ్యూటీ తమన్నాను సెలెక్ట్ చేశారు చిత్రబృందం.
చిరంజీవితో నటించే చాన్స్ తమన్నాకి రావడంతో ‘భలే చాన్సులే’ అంటూ సంబరపడిపోతున్నారు తమన్నా ఫ్యాన్స్. ‘సైరా’ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి స్టార్ట్ కానుందని సమాచారం. ఏడు రోజులు జరిగే ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ ఏర్పాటు చేశారు. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.