Hero And Heroine Combination Repeat Again In Tollywood - Sakshi
Sakshi News home page

Hero And Heroine Pair Repeat: ఒకేసారి రిపీట్‌ కానున్న 10 జంటలు..

Published Mon, Jun 27 2022 9:35 AM | Last Updated on Mon, Jun 27 2022 10:58 AM

Hero And Heroine Combination Repeat Again In Tollywood - Sakshi

హీరో-హీరోయిన్‌ జోడీ రిపీట్‌ కావడం కామన్‌. అయితే ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి పది జంటలు రిపీట్‌ అవుతున్నాయి. అన్నీ భారీ చిత్రాలే. బోలెడన్ని అంచనాలున్న సినిమాలే. ఇక రిపీట్‌ అవుతున్న జోడీ నటిస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 

చిరంజీవి-తమన్నా మళ్లీ ఆన్‌స్క్రీన్‌ లవర్స్‌గా కనిపించనున్నారు. ‘సైరా’లో ఈ ఇద్దరూ ప్రేమికులుగా కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బోళా శంకర్‌’లో జంటగా నటిస్తున్నారు. తమిళ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తమిళ కథ ప్రకారం ముందు హీరోని చంపాలనుకుంటుంది హీరోయిన్‌. ఆ తర్వాత అతనితో ప్రేమలో పడుతుంది. తెలుగు రీమేక్‌లోనూ ఇలానే ఉంటుందని అనుకోవచ్చు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్‌ కనిపిస్తారు. 

ఇక ‘మహర్షి’లో రిషీ కుమార్‌ (మహేశ్‌బాబు), పూజ (పూజా హెగ్డే)ల చిన్ని చిన్ని అలకలు, ప్రేమ, దూరం కావడం, మళ్లీ దగ్గరవడం చూశాం. తాజాగా త్రివిక్రమ్‌ సినిమా కోసం ఇద్దరూ మళ్లీ జత కట్టారు. మహేశ్‌-పూజ జతకట్టిన రెండో సినిమా ఇది. అయితే త్రివిక్రమ్‌తో ఈ ఇద్దరికీ మూడో సినిమా కావడం విశేషం. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్‌-మహేశ్, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్‌-పూజా హెగ్డే కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందనుంది. 

మరోవైపు రామ్‌ చరణ్‌-కియారా అద్వానీ కూడా మళ్లీ జతకట్టారు. ‘వినయ విధేయ రామ’లో తొలిసారి ఈ జంట కనిపించింది. ఇప్పుడు శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. శంకర్‌ డైరెక్ట్‌గా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ సంక్రాంతికి క్యూట్‌ లవర్స్‌గా ‘బంగార్రాజు’లో కనిపించిన నాగచైతన్య, కృతీ శెట్టి మరో సినిమాలో హీరో హీరోయిన్‌గా కనిపించనున్నారు. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. కోలీవుడ్‌కి చైతూ ఎంట్రీ ఈ సినిమాతోనే జరుగుతోంది. కాగా ఆల్రెడీ రామ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ది వారియర్‌’ ద్వారా కోలీవుడ్‌కి పరిచయం కానున్నారు కృతి. 

చైతూ, రాశీ ఖన్నాల జోడీ కూడా మళ్లీ కనిపించనుంది. ‘వెంకీ మామ’లో జంటగా నటించిన నాగచైతన్య-రాశీ ఖన్నా తాజాగా ‘థ్యాంక్యూ’లో హీరో, హీరోయిన్‌గా నటించారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 22న విడుదల కానుంది. దాదాపు ఐదేళ్ల తర్వాత నాని-కీర్తీ సురేష్‌ జోడీ రిపీట్‌ కానుంది. ఈ ఇద్దరూ ‘నేను లోకల్‌’లో తొలిసారి జంటగా నటించారు. తాజాగా ‘దసరా’లో నటిస్తున్నారు. తెలంగాణలోని గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. 

ఇంకోవైపు ఇంకోసారి ఖుషీగా జోడీ కట్టారు విజయ్‌ దేవరకొండ-సమంత. ‘మహానటి’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’లో నటిస్తున్నారు. వీళ్లే కాదు.. రెండోసారి జంటగా కనిపించనున్న హీరో-హీరోయిన్లు ఇంకా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement