బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌ | box office collection: Sye Raa Narasimha Vs War | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్‌ వసూళ్లు: సైరా వర్సెస్‌ వార్‌

Published Sat, Oct 5 2019 7:52 PM | Last Updated on Sat, Oct 5 2019 8:30 PM

box office collection: Sye Raa Narasimha Vs War - Sakshi

ఈసారి గాంధీ జయంతి సందర్భంగా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు ఒకేసారి, ఒకేరోజు విడుదల అయ్యాయి. వరుస సెలవులను క్యాష్‌ చేసుకోవడానికి పోటాపోటీగా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఆ సినిమాలేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘వార్‌’ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా.. సౌత్‌లో చారిత్రక సినిమాగా భారీ బడ్జెట్‌తో చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ విడుదలైంది. ఈ రెండు సినిమాలూ భారీ అంచనాల మధ్యే ప్రేక్షకులను పలుకరించాయి.

చారిత్రక నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల ఖర్చుతో రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి జీవిత కథతో సైరా సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేశారు. తెలుగుతోపాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా కోసం అన్ని భాషల్లోనూ భారీఎత్తున ప్రమోషన్స్‌ నిర్వహించారు. అటు బాలీవుడ్ బడా స్టార్స్‌ హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌లు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టార్‌ సినిమా వార్‌ కూడా భారీ అంచనాలతో గత బుధవారం ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఈ సినిమాలో హృతిక్‌ కబీర్‌గా, టైగర్‌ ఖలీద్‌గా.. గురుశిష్యులుగా నటించడం.. ఒళ్లు గగుర్పొడిచే భారీ యాక‌్షన్‌ సీక్వెన్స్‌ ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో మంచి బజ్‌ క్రియేట్‌ అయింది. సిద్ధార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈ ఏడాది అతిపెద్ద యాక‌్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా ప్రమోట్‌ చేశారు.


దుమ్మురేపిన కలెక్షన్లు..
భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’... మెగాస్టార్‌ స్టామినాను చాటుతూ బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అయితే, ఈ సినిమా ప్రధాన మార్కెట్‌ అయిన ఏపీ, తెలంగాణలోనే జోరుగా దూసుకుపోతుంది. సౌత్‌లోని ఇతర రాష్ట్రాల్లో ఓ మోస్తరు వసూళ్లు రాబడుతున్నా.. హిందీలో మాత్రం అనుకున్నంతగా రాణించలేకపోయింది. హిందీలో తొలిరోజు రూ. 2.6 కోట్లు సాధించి.. పర్వా లేదనిపించిన సైరా.. ఆ తర్వాత పుంజుకోలేక చతికిలపడింది. ఓవర్సీస్‌లోనూ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్‌ వద్ద గట్టిగా సత్తా చాటుతున్న ఈ సినిమా తొలి మూడురోజుల్లో వరల్డ్‌వైడ్‌గా రూ. 100 కోట్లకు పైగా సాధించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజే ఈ సినిమా రూ. 32 కోట్లు రాబట్టినట్టుసమాచారం. దసరా సెలవులు కావడం.. పాజిటివ్‌ టాక్‌ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో సైరాకు కలిసివస్తోంది. ముఖ్యంగా నైజాంలో ఈ సినిమా తొలి మూడు రోజుల్లో రూ. 14.62 కోట్లు రాబట్టింది. ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేశ్‌ బాలా ఈ విషయాన్ని ట్వీట్‌ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్‌ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) రివీల్‌ చేశారు. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్‌ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని రమేశ్‌ బాలా మరో ట్వీట్‌లో వెల్లడించారు.


రికార్డుల సృష్టిస్తున్న వార్‌
భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ అయిన వార్‌ మూవీ ఊహించినరీతిలో భారీ వసూళ్లే రాబడుతోంది. తొలిరోజు ఏకంగా రూ. 53.35 కోట్లు రాబట్టి.. బాలీవుడ్‌ చరిత్రలోనే అత్యధిక ఓపెనింగ్‌ డే కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. అదేవిధంగా మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. హిందీపరంగా విస్తారమైన మార్కెట్‌ ఉండటంతో వార్‌.. దసరా పండుగ సీజన్‌లో అత్యంత భారీ వసూళ్లు రాబట్టే అవకాశం కనిపిస్తోంది. హిందీ వెర్షన్‌లో తొలిరోజు రూ. 51 కోట్లు, రెండోరోజు గురువారం రూ. 23.10 కోట్లు, మూడో రోజు శుక్రవారం రూ. 21.25 కోట్లు సాధించిన వార్‌.. . తొలి మూడు రోజుల్లోనే రూ. 96 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక, తెలుగు, తమిళ వెర్షన్‌లలో రూ. 4.15 కోట్లు సాధించి.. మొత్తంగా రూ. 100.15 కోట్లు వార్‌ తన ఖాతాలో వేసుకుంది.

బాక్సాఫీస్‌ వద్ద వార్‌ జోరు చూస్తుంటే.. రానున్న రోజుల్లో మరింత వసూళ్లు సాధించి.. రికార్డులు బద్దలుకొట్టే అవకాశం కనిపిస్తోంది. గురువారం, శుక్రవారం సాధారణ వర్కింగ్‌ డేస్‌ అయినప్పటికీ.. వార్‌ వసూళ్లు తిరుగులేని రీతిలో ఉండటం ఇందుకు తార్కాణం అంటున్నారు ట్రేడ్‌ అనలిస్టులు. తొలి మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు సాధించిన ఐదో యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సినిమాగా వార్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ఇంతకుముందు ధూమ్‌-3, సుల్తాన్‌, టైగర్‌ జిందా హై, థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌ సినిమాలు తొలి మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులో చేరాయి. మొత్తానికి చూసుకుంటే.. తమకు గట్టి పట్టున్న మార్కెట్‌లో బాక్సాఫీస్‌ వద్ద సైరా, వార్‌ పోటాపోటీగా కలెక్షన్లు రాబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement