
సాక్షి, సినిమా : నటి తమన్నా భాటియా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లను చుట్టేస్తున్నారు. ఈ ముంబై బ్యూటీకి ఇప్పుడు టాలీవుడ్‌లో చేతి నిండా అవకాశాలు ఉన్నా, కోలీవుడ్‌లో తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ఇక్కడ కన్కే కలై మానే అనే ఒకే ఒక్క చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా హిందీలో ఒకటి, మరాఠిలో ఒకటి చేస్తున్న తమన్నా ఇంత వరకూ శాండిల్‌వుడ్, మాలీవుడ్‌లను టచ్ చేయలేదు. ఆ కొరిక మనసులో ఉన్నట్లుంది. ఆ ఆశను చెప్పకనే చెప్పేసింది. అసలు విషయం ఏమిటంటే ఈ మిల్కీబ్యూటీ ఇటీవల కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించింది.
ఆ ప్రకటనలో పునీత్ రాజ్‌కుమార్‌తో నటించడం సంతోషంగా ఉందని విలేకరులతో ముచ్చటిస్తూ చెప్పింది. దీంతో ఒక విలేకరి కన్నడ చిత్రాల్లో నటించే ఆలోచన లేదా అని ప్రశ్నించడంతో అలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్న తమన్నా కన్నడ చిత్రంలో నటించాలని తనకూ ఉందని, అయితే అందుకు ఒక నిబంధన ఉంటుందని అంది. ఏమిటా నిబంధన అన్న ప్రశ్నకు తాను పునీత్ రాజ్‌కుమార్‌తోనే నటిస్తానని చెప్పింది. దీంతో పక్కనే ఉన్న పునీత్ రాజ్‌కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలోకి రండి అని ఆహ్వానించారు. మొత్తం మీద తన ఎత్తుగడ పని చేసినందుకు తమన్నా చిరునవ్వులు చిందించింది. త్వరలోనే ఈ బ్యూటీ పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి ఒక కన్నడ చిత్రంలో నటించే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment