
తమన్నా, శ్రీదేవి (పాత చిత్రాలు)
సాక్షి, హైదరాబాద్ : దక్షిణాదితో పాటు హిందీ చిత్రసీమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక తమన్నా. అతిలోక సుందరి, దిగ్గజ నటి శ్రీదేవి పురస్కారం తమన్నా అందుకోనున్నారు. సినిమా రంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు ప్రతి ఏడాది ‘అప్సర అవార్డ్స్’ను అందజేస్తున్న విషయం తెలిసిందే. 2018 ఏడాదికిగాను నటి తమన్నా అప్సర అవార్డుకు ఎంపికయ్యారు. దీనిలో భాగంగా ఆమెకు దివంగత నటి శ్రీదేవి అవార్డును ఆదివారం సాయంత్రం హైదరాబాదలో జరిగే కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.
‘నేను ఇండస్ట్రీకొచ్చిన తొలినాళ్ల నుంచి శ్రీదేవిని చూస్తున్నాను. ఆమె పేరుతో ఇచ్చే అవార్డుకి నేను ఎంపికవ్వడం నిజంగా నా అదృష్టం. శ్రీదేవి మేడం లాగానే నేను కూడా చిన్నతనంలోనే సినీ పరిశ్రమకొచ్చాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకంటూఘో గుర్తింపు తెచ్చుకోవడం వెనక ఎన్నేళ్ల కృషి, శ్రమ ఉంటుందో చెప్పడానికి శ్రీదేవి జీవితమే ఒక ఉదాహరణ’ అని తమన్నా అన్నారు. 1983లో శ్రీదేవి నటించిన సూపర్ హిట్ మూవీ ‘హిమ్మత్ వాలా’ రీమేక్‌లో నటించి తమన్నా మంచి పేరు తెచ్చుకుంది. కన్నె కలై మన్నె, నా నువ్వే, క్వీన్ వన్స్ ఎగైన్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తమన్నా ఈ అవార్డుకు ఎంపికైన ఆనందంలో మునిగితేలుతున్నారు. ‘జీ తెలుగు చానల్’ ఈ అవార్డులను అందిస్తున్న విషయం తెలిసిందే.