
కొన్ని నెలల క్రితం చెన్నై కోడంబాక్కమ్‌లో హల్‌చల్ చేసిన ఓ వార్త నిజం అయ్యేట్లు ఉంది. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో హిందీ నటుడు షారుక్ ఖాన్ హీరోగా ఓ సినిమా రూపొందనుందన్నది ఆ వార్త సారాంశం. ఇక అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అట. ఈ సినిమాను పట్టాలెక్కించడానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయని తెలిసింది. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారట. 2018లో చేసిన ‘జీరో’ తర్వాత షారుక్ ఇప్పటివరకూ సినిమా కమిట్ కాలేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఫ్లాప్‌తో షారుక్ కథల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నారు. అట్లీ చెప్పిన కథ బాగా నచ్చిందట. తమిళంలో తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, మంచి మాస్ డైరెక్టర్ అనిపించుకున్న అట్లీకి హిందీలో ఇది తొలి సినిమా.