పైరసీ భూతాన్ని అరికట్టేందుకు తమిళ సినిమా ప్రొడ్యూసర్లు సంచనల నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.
చెన్నై: తమిళనాడులో సినిమాల విడుదలను కనీసం మూడు నెలలపాటు నిలిపివేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. ఆదివారం జరిగిన తమిళ సినిమా ప్రొడ్యూసర్ల కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశంలో దాదాపు సభ్యులందరూ దీనిపై సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
పైరసీ మూలంగా గత ఏడాదిగా నిర్మాతలు భారీగా నష్టపోతున్నారని, ఓ మూడు నెలలు సినిమాల విడుదలను నిలుపుదల చేస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నామని టిఎఫ్పీసీ అధ్యక్షులు కలైపులి ఎస్ థాను తెలిపారు. మిగతా నిర్మాతలు, సంబంధిత రంగాల వారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న తమను సినిమాల విడుదలను ఆపమనడం సమంజసం కాదని, రిలీజ్ ఆపినంత మాత్రాన పైరసీ భూతం వదలదని సీనియర్ ప్రొడ్యూసర్లు వాదిస్తున్నారు.