అందుకు నన్ను బాధ్యురాలిని చేశారు
నష్టాలకు నన్ను బాధ్యురాలిని చేసి వారు తప్పించుకున్నారు అంటూ ఇంత కాలం తనలో దహిస్తున్న ఆవేదనను వెళ్లకక్కింది నటి తాప్సీ. ఈ అమ్మడు ఇంతకు ముందు తమిళం, తెలుగు భాషల్లో చాలా చిత్రాల్లో నటించింది. అయినా ఆమె అందాలను తెరపై ఆవిష్కరించడానికి దర్శక, నిర్మాతలు ప్రయత్నించారు తప్ప అభినయాన్ని రాబట్టాలని ఎవరూ భావించలేదన్నది తాప్సీ ఆవేదన. ముఖ్యంగా కోలీవుడ్‌లో ధనుష్ వంటి స్టార్ హీరోకు జంటగా పరిచయమైన తాప్సీకి ఆ చిత్రం విజయం సాధించడంతో పాటు, జాతీయ అవార్డులు రాబట్టుకున్నా ఈమెకు మాత్రం ఇక్కడ ఏమంత ఆదరణ లభించలేదు.
ప్రస్తుతం బాలీవుడ్‌లో వెలిగిపోతున్న తాప్సీ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ దక్షిణాది చిత్ర పరిశ్రమపై ఆరోపణలు గుప్పించింది. అవేమిటో ఒక లుక్కేద్దాం. నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను. అందుకే హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించాను. అయితే నాకు కమర్శియల్ కథా చిత్రాలు అమరలేదు. అందుకే చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. చిత్ర అపజయాలతో నాపై అచ్చిరాని నటి అని ముద్ర వేసి దూరంగా పెట్టారు. అలా చిత్ర నష్టాలకు నన్ను బాధ్యురాలిని చేసి వారు తప్పించుకున్నారు. ఇది నన్ను చాలా బాధకు గురి చేసింది.
చాలా కాలంగా మనసులోనే దాసుకుని అనుభవించిన మానసిక వేదన ఇది. అయితే నా కుటుంబ సభ్యులు పక్క బలంగా నిలిచారు. ఆ తరువాత బాలీవుడ్‌పై దృష్టి పెట్టాను. అక్కడ మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. నా అభిమానులకు నేను చెప్పేదొక్కటే. ఎవరిపైనా ఆధారపడకండి. అమ్మ, నాన్న, అన్నయ్యల సహకారం కోసం ఎదురు చూడకుండా మీ అవసరాలను మీరే పూర్తి చేసుకోండి. ఎలాంటి సమస్యనైనా మీరే ధైర్యంగా ఎదుర్కోండి.