నవ్‌నీత్ నిషాన్
సాక్షి, ముంబై: మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద మనుషుల సాగించిన అకృత్యాలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి. బాలీవుడ్‌లో తనుశ్రీతో మొదలైన ఈ మీటూ ఉద్యమం ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. జర్నలిస్టులు, సినీ నటులు ఒక్కొక్కరు తమ గళం విప్పుతున్నారు. ప్రముఖ సినీ, టీవీ నటుడు అలోక్‌నాథ్ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని రచయిత, ప్రొడ్యూసర్ వింటా నందా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ మరో టీవీ నటి నవ్‌నీత్ నిషాన్ తన గళం విప్పారు. అలోక్‌నాథ్ నుంచి తనకు ఎదురైన వేధింపులను బయటి ప్రపంచానికి తెలియజేశారు. వింటా నందాకు మద్దతుగా నిలిచారు. ‘మీటూ ఉద్యమంలో భాగంగా తన కోసం నిలబడే ప్రతి మహిళకు నేను మద్దతుగా ఉంటాను. వింటాకు ఎదురైన అనుభవాన్ని, కలిగిన నొప్పిని నేను అర్థం చేసుకున్నాను. ఆ బాధను ఊహించలేం. నేను ఆ వ్యక్తి నుంచి నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొన్నాను. చివరకు చెంప దెబ్బతో బుద్దిచెప్పాను. దీంతో అతను నాపై కక్ష్యపూరితంగా వ్యవహరించాడు. ఆ షో నుంచి తీసేశాడు. లేనిపోనివి కల్పించి మీడియా వేదికగా నాపై అసత్య ప్రచారం చేశాడు. వాటన్నిటిపై పోరాడుతూ నేను నిలదొక్కుకున్నాను.’ అని చెప్పుకొచ్చారు.
1993-97 మధ్యలో వచ్చిన పాపులర్ టీవీ ‘తారా’ షోలో అలోక్‌నాథ్, నవ్‌నీత్ నిషాన్‌లు ప్రధానపాత్రల్లో నటించారు. ఆ సమయంలో ఓ మ్యాగ్‌జైన్ ఇంటర్వ్యూలో అలోక్‌నాథ్ తన కోస్టారైన నవ్‌నీత్ నిషాన్ డ్రగ్స్ తీసుకుందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment