చెన్నై పోదాం చలో... చలో! | telugu hero doing remake movies | Sakshi
Sakshi News home page

చెన్నై పోదాం చలో... చలో!

Published Sun, May 29 2016 11:03 PM | Last Updated on Wed, Jul 25 2018 2:35 PM

చెన్నై పోదాం చలో... చలో! - Sakshi

చెన్నై పోదాం చలో... చలో!

‘‘మేం పక్కా లోకల్.  మా  తెలుగు పేక్షకులు మా సినిమా చూస్తే చాలు’’ అనేది నిన్నటి మాట. ‘‘మా ప్రేక్షకులతో పాటు పొరుగు రాష్ట్రం ప్రేక్షకులు కూడా మా సినిమాలు చూస్తే మేలు’’ అనేది ఇవాళ్టి మాట. నిన్న మొన్నటి వరకూ మన తెలుగు స్టార్స్ మన భాష మీదే దృష్టి పెట్టారు. ఇప్పుడు మాత్రం పర భాషపై కూడా వీళ్ల దృష్టి పడింది. పెరుగుతున్న నిర్మాణ వ్యయానికి తగ్గ వసూళ్లు రాబట్టాలంటే పక్క రాష్ట్రాల్లో కూడా సినిమాని విడుదల చేస్తే ఉపయోగం ఉంటుందని గ్రహించినట్లున్నారు.

అది కూడా అనువాద రూపంలో కాకుండా.. నేరుగా చేస్తే ఇంకా ఉపయోగం ఉంటుందని లెక్కలేసినట్లున్నారు. అందుకే ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేయాలని కొంతమంది హీరోలు ఫిక్స్ అయ్యారు.

 
తమిళ తంబీలు ఒక అడుగు ముందే...
వాస్తవానికి తమిళ హీరోలు ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నారు. సీనియర్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. విక్రమ్ కూడా వీళ్ల రూట్‌నే ఫాలో అవుతూ అక్కడా, ఇక్కడా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. ఆ వరుసలో సూర్య, కార్తీ, తమిళంలో తమ చిత్రం విడుదలైనప్పుడే తెలుగులో కూడా అనువదించి, విడుదలయ్యేలా చూసుకుంటున్నారు.

ఇంకా అజిత్, విజయ్, శింబు, ధనుష్ వంటి హీరోలు కూడా అడపా దడపా తెలుగు తెరపై ప్రత్యక్షమవుతున్నారు. తెలుగు కుర్రాడు విశాల్, తమిళంలో చేస్తున్న చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగులో స్ట్రయిట్ చిత్రం చేయడానికి రెడీ అయిపోయారు. మనవాళ్లల్లో తమిళంలో మార్కెట్ సంపాదించుకున్న హీరోలు లేకపోలేదు.
 
‘శివ’, ‘గీతాంజలి’, ‘రక్షకుడు’.. ఇలా అప్పట్లోనే నాగార్జున ఇటు తెలుగు అటు తమిళంలో మార్కెట్ పెంచుకున్నారు. కానీ, ఆ తర్వాత మాత్రం ఎందుకనో కోలీవుడ్‌పై ఆయన పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ‘ఊపిరి’తో మళ్లీ తమిళ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి.. మళ్లీ ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తారా? లేదా తన చిత్రాలు అక్కడ అనువాదమై, విడుదలయ్యేలా చూసుకుంటారా? అనేది కాలమే చెప్పాలి. నేటి తరం హీరోల్లో మహేశ్‌బాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి హీరోల చిత్రాలు ఇక్కడ విడుదలైనప్పుడో, ఆ తర్వాతో పరభాషలోకి అనువాదమవుతున్నాయి.

ఆ విధంగా పొరుగు రాష్ట్రాల్లో వాళ్లు మార్కెట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ‘బాహుబలి’తో ఇతర భాషల్లో ప్రభాస్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పవన్ కల్యాణ్ తొలిసారిగా హిందీకి తన మార్కెట్‌ను విస్తరించుకున్నారు. ఈ హీరోలందరూ అనువాద రూపంలో కాకుండా ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేస్తే, మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కొంతమంది హీరోలు ద్విభాషా లేదా త్రిభాషా చిత్రాలు చేస్తున్నారు. కొన్ని చిత్రాలు ఆన్ సెట్స్‌లో ఉన్నాయి.. కొన్ని సెట్స్‌కి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. అవేంటంటే...
 
‘బాహుబలి -2’పై భారీ అంచనాలు
దేశవ్యాప్తంగా అందరూ మాట్లాడుకునేలా రూపొందిన టెక్నికల్ వండర్ ‘బాహుబలి’. ప్రస్తుతం ఈ చిత్రానికి రెండో భాగంగా తెరకెక్కుతోన్న ‘బాహుబలి: ద కన్‌క్లూషన్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగంతో  దర్శకుడిగా రాజమౌళికీ, హీరోగా ప్రభాస్‌కీ ఇతర భాషల్లో మార్కెట్ పెరిగింది. అందుకే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రెండో భాగాన్ని రూపొందిస్తున్నారు. మలయాళంతో పాటు ఇతర భాషల్లోకి అనువదించి విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తర్వాత ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రం చేస్తారని టాక్. దీన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్లాన్ చేస్తున్నారట.
 
మహేశ్ తమిళ్ పేసువారు!
‘గజిని’ ఫేం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ చిత్రం చేయ నున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించనున్నారు. ఇన్నాళ్లూ లోకల్, ఓవర్సీస్ మార్కెట్ గురించి మాత్రమే ఆలోచించిన మహేశ్ ఇప్పుడు మాత్రం పొరుగు రాష్ర్టంలో కూడా పాగా వేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గ దర్శకుణ్ణి సెలక్ట్ చేసుకున్నారు. తమిళ దర్శకుడు మురుగదాస్‌కి తమిళ్‌తో పాటు ‘స్టాలిన్’తో ఇటు తెలుగులో, ‘గజిని’ హిందీ రీమేక్‌తో హిందీలో మంచి మార్కెట్ ఏర్పడింది.

ఆ విధంగా మురుగదాస్ దర్శకత్వం వహించే చిత్రం అంటే ఈ మూడు భాషల్లోనూ అంచనాలు ఉంటాయి. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న హీరో కాబట్టి, మహేశ్‌బాబు తమ భాషలో నేరుగా నటిస్తున్నాడంటే పరభాష ప్రేక్షకులు కూడా అంచనాలు పెంచుకుంటారు. ఆ విధంగా మురుగదాస్‌తో చేయబోయే చిత్రంతో మహేశ్‌బాబు తమిళంలో జెండా పాతడం ఖాయం అని ఊహించవచ్చు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. మహేశ్ పుట్టిందీ పెరిగిందీ చెన్నైలోనే. అందుకని తమిళ భాష బాగా వచ్చు. ‘‘చెన్నై లవ్లీగా ఉంటుంది. అక్కడ నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి’’ అని ‘సాక్షి’తో అన్నారు. తమిళంలో డబ్బింగ్ చెప్పుకుంటానని కూడా పేర్కొన్నారు. సో.. మహేశ్ తమిళ్ పేసువారు (మాట్లాడతారు) అన్నమాట.
 
గోపీ.. గోయింగ్ టు చెన్నై!
అచ్చ తెలుగు కుర్రాడిలా ఉంటే మన తెలుగు హీరోల్లో గోపీచంద్ ఒకరు. మంచి మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న గోపీచంద్ ఇప్పటివరకూ ఇతర భాషల మార్కెట్‌పై ఆసక్తి కనబర్చలేదు. కానీ, ఇప్పుడు దృష్టి పెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ‘ఆక్సిజన్’ చిత్రంలో నటిస్తున్నారు. ‘భారతీయుడు’, ‘జీన్స్’, ‘ఒకే ఒక్కడు’, ‘ఖుషి’ వంటి సూపర్ హిట్స్ తీసిన ఎ.యం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. టైటిల్ నుంచే ఈ చిత్రంపై అంచనాలు మొదలయ్యాయి.
 
ఇకపై ‘కోలీ’ అర్జున్ కూడా...
అల్లు అర్జున్ తెలుగులోనే కాదు మలయాళంలో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నారు. తెలుగులో బన్నీ చేస్తున్న సినిమాలన్నీ దాదాపు మలయాళంలో అనువాదమై, విడుదలవుతుంటాయ్. మంచి వసూళ్లు కూడా రాబడతాయి. అక్కడివాళ్లకు అల్లు అర్జున్ అంటే ఎంత అభిమానం అంటే... ‘మల్లు అర్జున్’ అంటారు. అనువాద చిత్రాలకే అంత పేరు తెచ్చుకుంటే.. ఇక స్ట్రయిట్ చిత్రం చేస్తే ఎంత మార్కెట్ వస్తుందో? భవిష్యత్తులో మలయాళంలో సినిమా చేసే ఉద్దేశం ఉందో? లేదో కానీ, ప్రస్తుతానికి బన్నీ తమిళ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. అందుకే ఓ ద్విభాషా చిత్రం చేయాలని ఫిక్సయ్యారు. ప్రస్తుతం తమిళ దర్శకులు లింగుస్వామి, విక్రమ్‌కుమార్‌లతో చర్చలు జరుగుతున్నాయి. ఈ ఇద్దరిలో బన్నీ ఎవరితో సినిమా చేసినా అది తెలుగు, తమిళ భాషల్లో ఉంటుందని టాక్.
 
ఒకేసారి రెండు చిత్రాల్లో సందీప్...
‘ప్రస్థానం’తో మంచి పేరు తెచ్చుకుని, దాదాపు విలక్షణ చిత్రాల్లోనే నటిస్తున్న సందీప్ కిషన్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘మాయవన్’ అనే సైన్స్ ఫిక్షన్ మూవీలో నటిస్తున్నారు. అలాగే, ‘మానగరమ్’ అనే తమిళ స్ట్రయిట్ చిత్రంలోనూ అతనే హీరో.
 
మన తెలుగు హీరోల్లో తమిళంలో మంచి గుర్తింపు పొందినవారిలో నాని, శర్వానంద్, రానా ఉన్నారు. తమిళ చిత్రం ‘వెప్పమ్’, తమిళంలో విడుదలైన ‘నాన్ ఈ’ (తెలుగులో ‘ఈగ’) నానీని అక్కడివారికి దగ్గర చేశాయి. ఆ తర్వాత ‘నీదానే ఎన్ పొన్ వసంతం’, ‘నిమ్రిందు నిల్’, ‘పల్లాండు వాళ్గ’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేశారు. బలంగా దృష్టి పెడితే.. తమిళంలో మార్కెట్ పెంచుకోవడం నానీకి పెద్ద కష్టమేం కాదు. అలాగే శర్వానంద్‌కి తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘గమ్యం’ తమిళ రీమేక్ ‘కాదలున్నా సుమ్మా ఇల్లే’, ‘ఎంగేయుమ్ ఎప్పోదుమ్’ (తెలుగులో ‘జర్నీ’) వంటి చిత్రాలతో శర్వానంద్‌కి అక్కడ బాగానే మార్కెట్ ఏర్పడింది.

ఆ తర్వాత ఎందుకనో తెలుగు చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘ఆరంభం’, ‘బెంగళూరు నాట్కళ్’ చిత్రాల్లో చేసిన పాత్రలు రానాకి అక్కడ బాగానే గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం ‘ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా’ అనే చిత్రంలో రానా నటిస్తున్నారు. ఈ ఆరడుగుల హీరో ఇంకా కేర్ తీసుకుంటే తమిళంలో బాగానే మార్కెట్ పెంచుకోవచ్చు.

‘కళాకారులకు భాషతో సంబంధం లేదు’ అంటారు. సో.. ఈడ.. ఆడ.. ఏడ అయినా సినిమాలు చేసుకునే వెసులుబాటు ఉంది. సొంతింట్లోనే కాకుండా.. పొరుగింట్లో కూడా మార్కెట్ తెచ్చుకుంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం మన హీరోలు ఆ పని మీదే ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement