
ప్రేయసి కోసం!
మనసుకు నచ్చిన అమ్మాయి కోసం సప్త సముద్రాలు ఈదడానికి కూడా రెడీ అంటారు చాలా మంది కుర్రాళ్లు. ఓ యువకుడు ప్రేమ కోసం అలాంటి రిస్కే చేశాడు. చివరకు ఆ అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘ప్రేమికుడు’. మానస్, సనమ్ శెట్టి జంటగా కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మి ఎన్. రెడ్డి ఈ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మనసుకు హత్తుకునే అందమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. త్వరలో ఈ సినిమా పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ‘‘ఇదొక స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ. ఈ తరం మనోభావాలకు అద్దంపట్టే సినిమా’’ అని దర్శకుడు చెప్పారు. ఈ వేదికపై హీరో మానస్ పుట్టినరోజు వేడుక కూడా జరిగింది. ఈ వేడుకలో నిర్మాతలు దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.