జ్యోతిలక్ష్మి విషయంలో ఎందుకు ఇలా జరిగింది? | Telugu, Tamil films actress not attending Jyothi Lakshmi died | Sakshi
Sakshi News home page

జ్యోతిలక్ష్మి విషయంలో ఎందుకు ఇలా జరిగింది?

Published Thu, Aug 11 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

జ్యోతిలక్ష్మి విషయంలో ఎందుకు ఇలా జరిగింది?

జ్యోతిలక్ష్మి విషయంలో ఎందుకు ఇలా జరిగింది?

తమిళసినిమా: మనిషిలో మానవత్వం మరుగున పడుతోందా? లేక లేని మానవత్వం ముసుగులో మనిషి బతుకుతున్నాడా? ఒక వ్యక్తితో అవసరం ఉంటే ఆయన్ని మీ అంతటి వారు ఈ ధరణిలోనే లేరని బట్రాజు పొగడ్తలతో ముంచెత్తుతారు.అవసరం లేకపోతే ఎదురుపడినా ముఖం చాటేసుకుని పోతుంటారు. ఈ దేశం ఎటు పోతోంది? మృగ్యమవుతున్న మానవత్వంలో మనిషి గమ్యం ఎటువైపు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో స్వార్థం పరుగులు తీస్తుందన్నది ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటనతో తేటతెల్లమైంది. ప్రజల్లో సానుభూతి కరువవుతోందని చెప్పక తప్పదు. భారతీయ స్టార్ డాన్సర్, నటీమణి జ్యోతిలక్ష్మి కన్నుమూసిన విషయం తెలిసిందే.
 
  ఆమె సాధారణ నటీమణి కాదు. తెలుగు,తమిళం,మలయాళం, కన్నడం, హిందీ మొదలగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన గొప్పనటి, నర్తకి. ముఖ్యంగా తెలుగు,తమిళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించి అజరామర నటిగా కీర్తి గడించారు. జ్యోతిలక్ష్మి జీవించి ఉన్నప్పుడు తన చుట్టూ తిరిగిన సినిమా జనం, డాన్సింగ్ క్వీన్ అంటూ పొగడ్తల వర్షం కురించిన వందిగామదులు ఆ నటీమణి కన్నుమూస్తే ఆమెకు నివాళులర్పించడానికి కూడా రాలేకపోయారు. తన కుటుంబానికి సానుభూతిని అందించే ప్రయత్నం చేయలేకపోయారు.
 
 ఐదు భాషా చిత్రాల్లో నర్తించి అశేష ప్రేక్షకులను అలరించిన జ్యోతిలక్ష్మిని చివరి చూపు చూడడానికి పట్టుమని పది మంది సినీ ప్రముఖులు కూడా రాలేదంటే మానవత్వం ఏ స్థాయిలో మంటగలుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రముఖులు హైదరాబాద్‌లో చానళ్ల కెమెరాల ముందు జ్యోతిలక్ష్మి లెజెండ్, డాన్సింగ్ క్వీన్ అంటూ నాలుగు ముక్కలు మాట్లాడి చేతులు దులిపేసుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ జ్యోతిలక్ష్మి సాధించిన కీర్తి తక్కువేమీ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత తరఫున సమాచార, ప్రచార శాఖామాత్యులు జ్యోతిలక్ష్మి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అలాంటిది ఇక్కడి చిత్ర ప్రముఖలు ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ సంతాపం తెలపకపోవడం విచారకరం.
 
 అదే రోజు ఒక తమిళ సీనియర్ రచయిత, దర్శక నిర్మాత కన్నుమూస్తే ప్రముఖ నటుల నుంచి, దర్శక నిర్మాతలు తరలి వెళ్లి నివాళులర్పించారు. మరి జ్యోతిలక్ష్మి తమిళ కుటుంబానికి చెందిన నటే. ఆమెకు ఆ సానుభూతి దక్కకపోవడం దురదృష్టకరం. ఇలాంటి దుస్థితి ఒక్క జ్యోతిలక్ష్మికే కాదు ఇంతకు ముందు చాలా మంది విషయంలోనూ జరిగింది. ఒక ప్రఖ్యాత గీత రచయిత రాసిన ఎవరికి ఎవరు చివరికి ఎవరు అన్న గీత ం గుర్తుకొస్తోందీ సంఘటన చూస్తుంటే. ఈ ధోరణి మారాలి. మానవ విలువలు పెంపొందాలని ఆశిద్దాం. ఇది ప్రతి ఒక్కరూ సహృదయంతో ఆలోచించాల్సిన అంశం ఇది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement