
మలయాళ స్టార్‌తో... తమిళంలో...
తమిళంలో పేరు తెచ్చుకున్న తెలుగమ్మాయి అంజలికి ఇప్పుడు మరో బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చింది. త్వరలోనే ఆమె మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి సరసన నటించనున్నారు. కాకపోతే, ఇది మలయాళ సినిమా కాదండోయ్! తమిళ సినిమానే!! పేరు - ‘పేరణ్బు’. జాతీయ అవార్డులతో సహా పలు అవార్డులు సాధించి, ఆ మధ్య వార్తల్లో నిలిచిన ‘తంగ మీన్‌గళ్’ (బంగారు చేపలు అని అర్థం) చిత్ర దర్శకుడు రామ్ ఈ కొత్త చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ చిత్రానికి ఎవరిని హీరోయిన్‌గా ఎంచుకోవాలా అని ఆలోచించిన దర్శకుడు చివరకు తమిళంలో ‘అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్ మాల్’గా అనువాదమైంది) ఫేమ్ అంజలి వైపు మొగ్గారు. ఈ సినిమాలో మమ్మూట్టి ఒక బిడ్డకు తండ్రిగా వివాహితుడి పాత్ర పోషించనున్నారు. దయ, కరుణ, జాలి లాంటి అంశాలన్నీ ప్రధానంగా ఈ చిత్రకథ నడుస్తుందట. ఇందులో అంజలి పాత్ర కూడా ఆ అంశాలకు తగ్గట్లే ఉంటుందట! కానీ, విచిత్రం ఏమిటంటే, ‘‘ఈ సినిమాలో మమ్మూట్టి, అంజలి భార్యాభర్తలు మాత్రం కాదు’’ అని దర్శకుడు రామ్ వివరించారు.
గతంలో కొన్ని తమిళ చిత్రాల్లో నటించిన మమ్మూట్టి ‘వందేమాతరం’ తరువాత మళ్ళీ ఆరేళ్ళు గ్యాప్ ఇచ్చి, ఇప్పుడీ తమిళ చిత్రం చేస్తున్నారు. కొడెకైనాల్‌లో, ఆ తరువాత చెన్నైలో షూటింగ్ చేస్తారట. ‘తంగ మీన్‌గళ్’లో జాతీయ అవార్డు పొందిన బాలనటి సాధన కూడా ఈ ‘పేరణ్బు’లో కీలకపాత్ర ధరించనుంది. సంక్రాంతికి బాలకృష్ణ ‘డిక్టేటర్’ రానుండగా, ఇప్పుడీ తీపి కబురు. కొత్త సంవత్సరం మన అంజలికి కలిసొచ్చినట్లే ఉంది!