
మూడు నెలల వయసులోనే... తెరపై!
బ్రూస్లీ.. ఈ పేరు వినని సినీ ప్రియులు ఎవరూ ఉండరేమో! ఈ మార్షల్ ఆర్ట్స్ హీరోను స్ఫూర్తిగా తీసుకుని చాలా మంది నటులు వెండితెరపై వెలిగారు. బ్రూస్లీ చేసింది 32 చిత్రాలైనా ప్రేక్షకులు గుండెల్లో చెరగని ముద్ర వేశారు. అయితే, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా బ్రూస్లీ కూడా చిన్నతనంలోనే వెండితెరపై తళుక్కుమన్న సంగతి చాలా మందికి తెలీదేమో! మూడు నెలల వయసులోనే ఆయన ‘గోల్డెన్ గేట్ గర్ల్’ చిత్రంలో కనిపించారు.
1941లో షూటింగ్ జరిగిన ఈ చిత్రం 1946లో విడుదలైంది. అన్నట్లు, బాలనటుడిగా ఆయన మొత్తం 20 చిత్రాలలో నటించారు. బ్రూస్లీ తండ్రి లీ హాయ్ చూన్ హాంగ్‌కాంగ్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు. పెద్దయ్యాక యాక్షన్ హీరో బ్రూస్లీ రేపిన సంచలనం గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదేమో!