చెక్కు చెదరని అభిమానం
అభిమానానికి హద్దులు, అంతం లేని అతికొద్దిమంది కథా నాయకుల్లో దివంగత మహానటుడు ఎంజీఆర్ ఒకరు. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మకుటం లేని మహరాజుగా వెలిగారు.
ఆయన నటించిన ఎన్నో చిత్రాలు ఆయిరత్తిల్ ఒరువన్ ఒకటి. 1965లో తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నేటి ముఖ్యమంత్రి జయలలిత ఎంజీఆర్‌తో తొలిసారిగా హీరోయిన్‌గా జత కట్టారు. బీఆర్ పంతులు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రేమ, హాస్యం, యాక్షన్ తదితర జనరంజక అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే చెన్నైలోని మిడ్‌ల్యాండ్, శ్రీకృష్ణ మేఘల థియేటర్లలో వందరోజులు దాటి ప్రదర్శితమైంది.
అదేవిధంగా మదురై, కోవై, తిరుచ్చి, సేలం తదితర ప్రాంతాల్లో 150 రోజులకు పైగా ఆడింది. 48 ఏళ్లలో పలు ప్రాంతాల్లో పలుమార్లు విడుదలై ఇప్పటి వరకు మూడువేల థియేటర్లలో ప్రదర్శితమై బయ్యర్లకు లాభాలు ఆర్జించిపెట్టిన చిత్రం ఆయిరత్తిల్ ఒరువన్. అలాంటి చిత్రం మళ్లీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీతో ఆధునిక హంగులు దిద్దుకుని శుక్రవారం తెరపైకి వచ్చింది.
ఆమోఘ ఆదరణ
ఈ చిత్రానికి ఎంజీఆర్ అభిమానుల నుంచి అమోఘ ఆదరణ లభించింది. నగరంలోని సత్యం, ఎస్కేప్, ఐనాక్స్, పీవీఆర్, దేవి వంటి మల్టీఫ్లెక్సీ థియేటర్లలో విడుదలైంది. ఆయా థియేటర్లలో ఎంజీఆర్ అభిమానులు భారీ కటౌట్లు, బ్యానర్లు నెలకొల్పి ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించి తమ వీరాభిమానాన్ని నిరూపించుకున్నారు. అంతేకాకుండా కటౌట్లకు పుష్పాంజలి ఘటించారు. థియేటర్లలో మూడు రోజులకు పూర్తిగా అడ్వాన్స్ టికెట్లు బుక్ కావడం విశేషం. జనం కుటుంబం సహా సినిమా చూడడానికి తరలిరావడం మరొక విశేషం. కొత్త చిత్రాలకు కూడా ఇంత ఆదరణ ఉండదని థియేటర్ల యాజమాన్యం పేర్కొనడం విశేషం.
కాలాన్ని గెలిచిన చిత్రం :
ఆధునిక హంగులతో ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రం విడుదలైన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పేర్కొంటూ విప్లవ నాయకుడు ఎంజీఆర్ నటించిన చిత్రాలు తరాలకతీతంగా నిలిచే అజరామరమని పేర్కొన్నారు. ఆయన నటించిన చరిత్ర సృష్టించిన చిత్రాల్లో ఆయిరత్తిల్ ఒరువన్ ఒకటని తెలిపారు. ఆ చిత్రంలో తాను తొలిసారిగా ఎంజీఆర్‌కు జంటగా నటించానని తెలిపారు.